ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడంలో సీబీఐ దూకుడు పెంచింది. గతంలో హత్య కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందంటూ సీబీఐపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ కేసును  సీబీఐ అధికారులు తుది దశకు తీసుకొచ్చారు. అంతేకాదు అత్యంత పకడ్బంధీగా పక్కా  సాక్ష్యాధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సీబీఐ అధికారుల దృష్టిలో కీలక అనుమానితులుగా ఉన్న వారిని నిందితులుగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నారు. ఇప్పుడు వరుస అరెస్టులతో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అనుమానితుల గుండెల్లో అలజడి పెరుగుతోంది. రెగ్యులర్‌గా విచారించే ప్రక్రియలో భాగంగా పిలిచి.. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని అనుమానితులు భయపడుతున్నారు.

వివేకా హత్యకేసులో పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ బృందం అనేక సార్లు విచారించింది. కీలక సమాచారం సేకరించింది. సునీల్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో కూడా సీబీఐ హాజరు పరిచింది.  ఆ తర్వాత పులివెందుల ప్రాంతానికే చెందిన ఉమాశంకర్‌ రెడ్డిపై సీబీఐ ఫోకస్ పెట్టింది. విచారణలో ఉమాశంకర్ రెడ్డి పేరును సునీల్ కుమార్ యాదవ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. హత్య కేసులో ఉమాశంకర్ పాత్ర ఉన్నట్టు వాంగ్మూలంలో వివేకా డ్రైవర్ దస్తగిరి కూడా చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అనేకసార్లు విచారించింది. రెండు రోజుల క్రితం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచింది.

వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సీబీఐ నిర్ధారించుకుంది. ఇద్దరి పేర్లను రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచింది. కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఉమాశంకర్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ... పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు. ఓవైపు వాంగ్మూలాలు..మరోవైపు అరెస్ట్‌లు..నార్కో ఎనాలిసిస్ పరీక్షలు చూస్తుంటే..సీబీఐ ఆల్రెడీ కేసును ఛేదించి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తోందని అంటున్నారు. త్వరలోనే కేసును క్లోజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: