
ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోను తనదైన శైలితో ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తు చేశారు. 1972లో మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఎందరు ముఖ్యమంత్రులు మారినా మంత్రి మండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాల పై విశేషానుభవం ఉన్న రోశయ్య 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. ఆ అనుభవం, ఆ విధేయత ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపింది అని వ్యాఖ్యానించారు.
ఆపత్కాల సమయంలో 14 నెలల పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. పాలనాపరంగా ఆయన చూపిన విజ్ఞత, వ్యవహారశైలిని తెలుగు ప్రజలు మరచిపోలేరు అని అన్నారు. అనంతరం పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తమిళ ప్రజల ఆదరాభిమానాలను పొందడం ఆయనలో విశాల దృక్పథానికి నిదర్శనం అని దివంగత నేత రోశయ్యను గుర్తు చేసుకున్నారు. ఆయనలో వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయన్నారు.