నిష్కలంక రాజకీయయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన శ్రీ కొణజేటి రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. త‌న‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న రోశయ్య మ‌ర‌ణం వేదనకు గురి చేసింది అని ఆవేద‌న చెందారు. జనసేన పార్టీని స్థాపించిన తరువాత రెండు మూడుసార్లు కలిసినప్పుడు ఆయన నాకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపించారు అని గుర్తు చేసుకున్నారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే 1968లో శాసనమండలి సభ్యునిగా ఎంపికైనది మొదలు ఆయన నిరంతరంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నార‌ని పొగిడారు.



 ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోను తనదైన  శైలితో ప్రత్యేకతను  చాటుకున్నార‌ని గుర్తు చేశారు. 1972లో మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఎందరు ముఖ్యమంత్రులు మారినా మంత్రి మండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నార‌ని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాల పై  విశేషానుభవం ఉన్న రోశయ్య 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. ఆ అనుభవం, ఆ  విధేయత  ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపింది అని వ్యాఖ్యానించారు.


   ఆపత్కాల సమయంలో 14 నెలల పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా సేవలు అందించార‌ని గుర్తు చేసుకున్నారు. పాలనాపరంగా ఆయన చూపిన  విజ్ఞత, వ్యవహారశైలిని తెలుగు ప్రజలు మరచిపోలేరు అని అన్నారు. అనంతరం పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తమిళ ప్రజల ఆదరాభిమానాలను పొందడం ఆయనలో విశాల దృక్పథానికి నిదర్శనం అని దివంగ‌త నేత రోశ‌య్య‌ను గుర్తు చేసుకున్నారు. ఆయనలో వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయ‌న్నారు.




సుదీర్ఘ కాలంపాటు ఉన్నత పదవులలో కొనసాగినా వేలెత్తి చూపలేని పాలన ఆయన సొంతం అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. నీతి నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య గారు నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులు అన్నారు. రోశయ్య గారు మృతికి త‌న‌ తరపున, జనసేన తరపున సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి  తెలియచేస్తున్నాన‌న్నారు. ఈ దుఃఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: