తన వ్యూహాలపై సీఎం కేసీఆర్ నమ్మకం కోల్పోయారా..? అందుకోసం ఓ కొత్త వ్యూహకర్తలను ఎంచుకున్నారా..? ఆ వ్యూహకర్త తో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయబోతున్నారా? ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారంటే దాన్ని ఎలా చేధించాలో సీఎం కేసీఆర్ కు తెలిసినంత ఎవ్వరికీ తెలియదంటారు వ్యూహకర్తలు. ఆయన తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు, చూపించే తెగువ, అద్భుతమైన  వాక్చాతుర్యం, అంతకుమించిన వ్యూహరచన ఇలా ఎలా చూసినా ఆయనతో సరిపోగల నాయకులు  సమకాలీన రాజకీయాల్లో ఉండరని కుండబద్దలు కొడతారు. తాను పాలిస్తున్న ప్రభుత్వంపైన, తాను నడిపిస్తున్న పార్టీ పైన ఏ మాత్రం వ్యతిరేకత వస్తుందని అనిపించినా, అలా కనిపించినా వెంటనే రంగంలోకి దిగుతారు.

పరిస్థితిని చక్కదిద్దారు. కెసిఆర్ ఓ వ్యూహకర్త కోసం చూస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వ్యవకర్త పేరే సునీల్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ఆమాటకొస్తే దేశ రాజకీయాల్లో కూడా ఏనాడు వినిపించని పేరు. అలాంటి ఓ వ్యక్తి సీఎం కేసీఆర్ కు  వ్యూహకర్తగా మారి ఢిల్లీ పెద్దల దగ్గర రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరాఖండిగా చెబుతున్నారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా, రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. సునీల్ అనే ఒకానొక స్ట్రాటజిస్ట్ టీమ్ తో కెసిఆర్ పనిచేయనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో వ్యూహకర్త సునీల్ పేరును ప్రస్తావనలో కి తెచ్చిన రేవంత్ రెడ్డి రేపు రేపు మరెలాంటి బాంబు పేల్చనున్నారోనన్న కంగారు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాటజిస్ట్ సునీల్ టీం ను అప్రోచ్ అయ్యారని గ్రౌండ్ లెవెల్ లో పాతుకుపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు బిజెపి, టిఆర్ఎస్ కలిసి సునీల్ ద్వారా డ్రామా నడిపిస్తున్నారంటూ రేవంత్ పేల్చిన బాంబు పై సర్వత్రా చర్చ జరుగుతోంది. సునీల్ ఢిల్లీలో కమలం పెద్దల దగ్గర రాజకీయాలు నడుపుతున్నారని, ఆయన గురించి పూర్తి వివరాలు అతి త్వరలోనే బయటపెడతానంటూ రేవంత్ మాట్లాడారు. తన వ్యూహాలపై నమ్మకం కోల్పోయిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ వ్యూహకర్తను తెచ్చి పెట్టుకున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. సునీల్ అనే వ్యూహకర్త డైరెక్షన్లోనే వరి వ్యవహారం నడిపిస్తున్నారన్నారు.

 బిజెపి, టిఆర్ఎస్ కలిసి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపి టిఆర్ఎస్ దోస్తీకి అదే నిదర్శనం అన్నారు. మొత్తానికి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త పేరును రేవంత్ రెడ్డి తెర పైకి తీసుకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాలన్నీ చాటుమాటుగా జరుగుతాయని, అలాంటిది సునీల్ పేరు ఎలా బయటికి వచ్చి ఉంటుందోనన్న టాక్  నడుస్తోంది. ఒకవేళ సునీల్ అనే వ్యూహకర్త ను కేసీఆర్ నిజంగానే నియమించుకుంటే దాని పర్యవసనాలేంటో, వాటిని ఎలా తిప్పికొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: