రాజకీయాల్లో వెన్నుపోటులు సహజమే...ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి పరోక్షంగా పనిచేసే కోవర్టులు ఎక్కువగానే ఉన్నారు. పార్టీలో నేతల తీరు నచ్చకపోవడం, లేదా పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్ల కొందరు నేతలు పరోక్షంగా వేరే పార్టీకి సాయం చేస్తారు. ఈ కోవర్టు నేతలు అన్నీ పార్టీల్లో ఉన్నారు. అయితే తెలంగాణలో ఎక్కువగా అధికార టీఆర్ఎస్‌లో కనిపిస్తున్నారు. ఈ మధ్య టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని భావిస్తున్న నేతలు పరోక్షంగా వేరే పార్టీకి సహకరిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. గెలవడానికి టీఆర్ఎస్ అభ్యర్ధులు అందరూ గెలిచారు. కానీ అనుకున్న మేర ఓట్లు మాత్రం పడలేదు. అసలు టీఆర్ఎస్‌కు ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తిగా టీఆర్ఎస్ అభ్యర్ధులకు మద్ధతు ఇవ్వలేదు. కొందరు క్రాస్ ఓటింగ్‌ చేసి కారుకు డ్యామేజ్ చేశారు.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణంగా చేశారు. గెలవడానిని టీఆర్ఎస్ అభర్ధి తాతా మధుసూదన్ విజయం సాధించారు. కానీ ఎక్కువ మెజారిటీ రాలేదు. అసలు టీఆర్ఎస్ ఓట్లు మొత్తం ఆయనకు పడలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయని, కానీ కాంగ్రెస్ అభ్యర్ధికి 242 ఓట్లు పడ్డాయి. అంటే అన్నీ ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఖమ్మంలో కారుకు కట్టప్పలు వెన్నుపోటు పొడిచేశారు.

దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీలో ఉంటూనే, పార్టీకి వెన్నుపోటు పొడిచారని, సొంత పార్టీని దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని, అయినా సరే మిగతా వారు పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. అయితే తుమ్మల అన్నది ఎవరిని అనే చర్చ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఖమ్మం కారులో ఉన్న ఆ కట్టప్పలు ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: