తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. రాజకీయంగా తన స్థానం బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ఏర్పాటు చేసిన టీవీకే పార్టీకి ప్రజల నుంచి ఊహించిన కంటే మంచి స్పందన వస్తోంది. ఈ సమయంలో కరూరులో జరిగిన తొక్కిసలాట ఆయన ఇమేజ్‌కి భారీ దెబ్బ తగిలించింది. ఈ సంఘటనలో 40 మంది మృతిచెంద‌డం, ప‌లువురు గాయాల‌పాలు కావడం ఆయనను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ క్లిష్టమైన ఈ సమయంలో, సినీ పరిశ్రమ నుంచి విజయ్‌కి గట్టి మద్దతు రావలసి ఉన్నా పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.


చాలామంది ప్రముఖులు ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ ఘటనకు విజయ్ నేరుగా బాధ్యత వహించాలన్నారు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ కూడా విజయ్ తప్పించుకోలేరని, ప్రజాసభల్లో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు. నటి ఒవియా అయితే మరింత దూకుడుగా మాట్లాడుతూ, విజయ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు నటుడు విశాల్‌తో పాటు కొందరు యువ నటులు స్పందించినా, వారు బాధితులకు మద్దతుగా మాత్రమే మాట్లాడారు.


సాధారణంగా తమిళ సినీ పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో ఏకతాటిపైకి వస్తుంది. కానీ విజయ్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా మారింది. పరిశ్రమలో ఉన్న గ్రూపులు, ఆధిపత్య పోరాటాలు కారణంగా చాలా మంది ఆయనకు దూరంగా ఉంటున్నారు. పై స్థాయి పొజిషన్లలో ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలు ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నారు. ఈ ఘటనలో తనను అరెస్టు చేస్తారేమో అన్న ఆందోళ‌న విజ‌య్‌లోనూ ఉంది.
ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. దీంతో విజయ్ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నా, తుది నివేదిక ఎలా ఉంటుందో అనే ఆందోళన మాత్రం కొనసాగుతోంది.


ఈ పరిస్థితిలో విజయ్‌కు గట్టి మద్దతుగా నిలిచింది బీజేపీ మాత్రమే. ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే విజయ్‌కి తోడుగా ఉన్నామని ప్రకటించారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రాధాన్యం పరిమితంగానే ఉండటంతో, విజయ్‌పై ఒత్తిడి తగ్గకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, కరూరు ఘటన విజయ్ రాజకీయ ప్రయాణానికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: