2024 సాధారణ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావోరేవో లాంటివి. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా 23 సీట్లతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు  చావోరేవో అవుతాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత బాబు తప్పుకుంటే ఆయన రాజకీయ వారసుడిగా లోకేష్ కి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లోనూ ప్రతీ సీటులోనూ తెలుగుదేశం పార్టీకి గెలుపు ముఖ్యం కానుంది.

గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా.. పార్టీ సీనియర్ నేతలు ఇతర కీలక నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో లోక్‌స‌భకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం శ్రీకాకుళం జిల్లా లో వినిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు 2014 - 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ మూడు సీట్లలో శ్రీకాకుళం సీటు కూడా ఒకటి. రామ్మోహన్ నాయుడు కు వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతోనే శ్రీకాకుళం ఎంపీ గా ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం వెల‌మ సామాజికవర్గానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది.

ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ధర్మాన ప్రసాదరావు కూడా ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం టౌన్ మారడంతో నరసన్నపేట కృష్ణ దాస్‌ ఆక్రమించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బగ్గు లక్ష్మణరావు టిడిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రామ్మోహన్ నాయుడు పోటీ చేయాలనుకుంటే కచ్చితంగా ఈ సీటు ఆయనకే దక్కుతుంది.

రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ బరిలో ఉంటే లోకేష్ కోటరీలో కింగ్‌ అవుతారు. అయితే చంద్రబాబు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రామ్మోహన్నాయుడు లోక్‌స‌భ లోనే ఉండాలని అనుకుంటే ఆయన ఎంపీగానే పోటీ చేయించవచ్చు.. మరి వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: