బలమైన క్యాడర్ ఉండి, 40 సంవత్సరాల చరిత్రున్న తెలుగుదేశంపార్టీకి రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీకి అభ్యర్ధే దొరకటంలేదట. వినటానికే విచిత్రంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజమనే చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటంటే రాజమండ్రి పార్లమెంటు స్ధానం. మొదటినుండి ఈ నియోజకవర్గం టీడీపీకి పెద్దగా అచ్చిరాలేదు. కారణం ఏమిటంటే ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్ధితో ప్రయోగాలు చేయటమే.




ఇపుడు ప్రస్తుతానికి వస్తే 2009లో రాజమండ్రి నుండి సినీనటుడు మురళీమోహన్ పోటీచేసి  ఓడిపోయారు. ఓడిపోయినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకున్నారు. తమ కుటుంబానికి చెందిన ట్రస్టు ద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన కూడా జరిగింది. తర్వాత అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మళ్ళీ మురళీమోహనే పోటీచేశారు.




అప్పటికే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని  ట్రస్టు ద్వారా కార్యక్రమాలు చేస్తుండటం, పొత్తుల్లో బీజేపీ, జనసేన మద్దతు కారణంగా టీడీపీ గెలిచింది. అయితే ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా నియోజకవర్గానికి మురళీమోహన్ చేసిందేమీ లేదు. తర్వాత 2019లో వ్యక్తిగత కారణాల వల్ల మురళీమోహన్ పోటీ చేయలేదు. తనకు బదులుగా తన కోడలు రూపను పోటీచేయించారు. అయితే అప్పటికే పార్టీతో పాటు వ్యక్తిగతంగా మురళీమోహన్ కు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేయటంతో టీడీపీ ఓడిపోయింది.




ఈ సీటులో వైసీపీ చేసిన బీసీ అభ్యర్ధి ప్రయోగం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కారణంగా పార్టీ అభ్యర్ధి భరత్ మంచి మెజారిటితో గెలిచారు. ఎప్పుడైతే టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటినుండి మురళీమోహన్ ట్రస్టు కార్యకలాపాలు ఆగిపోయాయి. అలాగే ఆయన ఆఫీసు కూడా మూసేశారు. కుటుంబసభ్యులు కూడా ఎవరు కనబడటంలేదు. దీంతో ఆయన ప్లేసులో పార్టీ కొత్త అభ్యర్ధిని రెడీ చేసుకోవాల్సొచ్చింది.




అయితే వివిధ కారణాల వల్ల ఎంపీగా పోటీచేయటానికి ఎవరు ముందుకు రావటంలేదు. ఆదిరెడ్డి వాసు, అల్లూరి ఇంద్రకూమార్ పేర్లు వినిపించినా తమకు ఆసక్తి లేదని చెప్పేశారట. బుచ్చయ్యచౌదరినే పోటీలోకి దింపాలంటే వయోభారం+ఆర్ధిక సమస్యలతో తాను పోటీచేయలేనని చెప్పేశారట. దాంతో పొత్తులు కుదిరితే సీటును జనసేనకు ఇచ్చేయాలని చంద్రబాబు ఫిక్సయినట్లు టాక్ నడుస్తోంది. మరి పొత్తులు లేకపోతే ఏమి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: