ఉత్తరాంధ్రలోనే కాదు యావత్ రాష్ట్రం మొత్తంలో గంటా శ్రీనివాసరావు గురించి తెలియనివారుండరు. వలస రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గంటా గురించి చెప్పుకున్న తర్వాతే ఇంకెవరైనా. అలాంటి గంట ప్రస్తుతం టీడీపీ తరపున విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇపుడు ఈయనగురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకున్నారట.

గంటా స్పెషాలిటి ఏమిటంటే పార్టీ, నియోజకవర్గాలను చాల తేలిగ్గా మార్చేస్తుంటారు. చాలామంది పార్టీలు మాత్రమే మారుస్తారు. ఆరునూరైనా తన నియోజకవర్గం నుండే పోటీచేస్తానని నేతలు నానా యాగీ చేస్తారు. కానీ గంటాతో ఆ సమస్య అసలు లేనేలేదు. కాకపోతే ప్రతి ఎన్నికకు కొత్త నియోజకవర్గంలో పోటీచేసే గంటా ప్రతిసారి ఎవరో ఒక నేతకు ఎసరుపెడుతుంటారంతే.

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుండి కాకుండా గాజువాక నుండి పోటీచేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ వ్యూహంతోనే ఎవరు అడగకపోయినా, ఏమీ ఉపయోగం లేదని తెలిసినా ముందుగా గంట ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసేశారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో వైజాగ్ లో పెద్ద వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్మికులు, ఉద్యోగులకు మద్దతుగా ఏడాది కిందటే గంటా రాజీనామా చేశారు.

నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంటు, సామాజికవర్గ సమీకరణలు, తనకు మద్దతుగా ఉండే వాతావరణం తదితరాలన్నింటినీ గంటా ముందే సర్వే చేయించుకున్నారట. ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని తేలిన తర్వాతే గంటా రాజీనామా చేసినట్లు సమాచారం. రేపటి ఎన్నికల్లో గంటా జనసేన తరపునే పోటీచేసే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటివరకు గంటా చేరని పార్టీ అంటే జనసేన మాత్రమే. జనసేనకు పొత్తలున్నా లేకపోయినా తనవరకు గంటా సేఫ్ పొజిషన్ చూసుకోవటం ఖాయం. కాబట్టి ఏ పార్టీ తరపున పోటీచేసినా గెలవటమే లక్ష్యంగా ముందుగానే ఎంఎల్ఏగా రాజీనామా చేశారట. మొత్తానికి గంటా నెక్స్ట్ టార్గెట్ గాజువాకపైన పెట్టారన్నది తాజా టాక్. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: