తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల జాతర నడుస్తోంది. 80 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామని సాక్షాత్తూ సీఎం ప్రకటించిన నేపథ్యలో నిరుద్యోగులు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇలాంటి వారికి ప్రిపరేషన్ కోసం గ్రంథాలయాలు ఓ మంచి ప్రిపరేషన్ సెంటర్లుగా మారుతున్నాయి. గ్రంధాలయాలకు వచ్చే వారి సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా బాగా పెరిగింది. అక్కడయితే ప్రశాంతంగా చదువుకోవచ్చన్నది వారి ఆశ. అయితే చాలా గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు అసౌకర్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. అనేక జిల్లాల్లో కేంద్ర గ్రంథాలయంలో కనీసవసతులు కరవయ్యాయి. నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.


తెలంగాణలో ఒకేసారి 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. జిల్లాల్లో ఉండే ప్రధాన గ్రంథాలయాలకు రోజూ వందల సంఖ్యలో ఉద్యోగార్థులు వస్తున్నారు. యువతీ, యువకులు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ గ్రంథాలయాల్లో వందల  పుస్తకాలు అందుబాటులో ఉన్నా అవి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి కావు. చాలా మంది సొంతంగా అవసరమైన పుస్తకాలను వెంట తెచ్చుకుని చదువుకుంటున్నారు.


అసలే వేసవి. చాలా గ్రంథాలయాల్లో ఏసీలు, కూలర్లు పనిచేయవు. ఉక్కపోతతో చదువు సాగక ఉద్యోగార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల వైఫై సౌకర్యం లేక కంప్యూటర్లు మూలన పడి ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు చాలా చోట్ల తెప్పించడంలేదు. కొన్ని చోట్ల  కుర్చీలు ఉద్యోగార్థులే తెచ్చుకుంటున్నారు కూడా. మధ్యాహ్నం వేళ చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. కనీసం తాగునీరు, టాయిలెట్‌ వసతి సమకూర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.


అయితే.. నిధుల కొరతతో సరైన వసతులు కల్పించలేకపోతున్నామంటున్నారు అధికారులు. కొన్ని గ్రంథాలయాల్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కొన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రంధాలయాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సమస్యపై దృష్టి సారిస్తారా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: