మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి విషయంలో అందరికీ క్లారిటి వస్తున్నట్లే ఉంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈనెల 23వ తేదీన పోలింగ్ జరగబోతోంది. వైసీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి అత్యధిక మెజారిటితో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే అన్నీ మండలాలకు ఇన్చార్జిలను నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలను కూడా రంగంలోకి దింపారు.





మంత్రులు, సీనియర్ నేతలు, మాజీమంత్రులు రంగంలోకి దిగినా జిల్లాలోని వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఇంతవరకు అడ్రస్ లేరు. పార్టీయే బాధ్యతలు అప్పగించలేదో లేకపోతే ఆనమే ఆసక్తి చూపలేదో తెలీటంలేదు. ఏదేమైనా ఉపఎన్నిక హడావుడిలో ఆనం పాత్ర మాత్రం ఎక్కడా కనబడటంలేదు. చాలాకాలంగా జగన్ అంటే ఆనం మండిపడుతున్న విషయం తెలిసిందే. తనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా తనకన్నా జూనియర్లను తీసుకున్నారనే విషయంలో ఆనం తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తంచేస్తున్నారు.






మంత్రిపదవి రాలేదన్నది ఒక బాధైతే మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లా యంత్రాంగం తనకు విలువ ఇవ్వటంలేదన్నది మరోబాధగా తయారైంది. అంతాకలిపి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడేంత అసంతృప్తిగా మారింది. ఇదే సమయంలో తొందరలోనే ఆనం టీడీపీలోకి మారిపోతారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. నిజానికి అసలు ఆనంను వైసీపీలోకి తీసుకోవటమే ఎక్కువ. అలాంటిది పోనీలే అని పార్టీలో చేర్చుకుని ఎంఎల్ఏ టికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా అసంతృప్తిగా ఉన్నారంటే ఎవరు చేయగలిగేదిలేదు.





తాను వైసీపీలో చేరిన సందర్భం ఏమిటి ? టీడీపీలో నుండి ఎందుకు బయటకు వచ్చేశారనే విషయాన్ని ఆనం మరచిపోయారు. రావటం రావటమే మంత్రిపదవి ఆశించటం, దక్కకపోవటంతో అసంతృప్తి వ్యక్తంచేయటం కాంగ్రెస్ లో సాధ్యమైందేమో కానీ జగన్ ముందు సాగదు. ఈ విషయం తెలుసుకోకుండా అసంతృప్తని అదని ఇదని గోలచేసుకుంటే నష్టపోయేది తానే కానీ వైసీపీ మాత్రం కాదన్న విషయాన్ని ఆనం రామనారాయణరెడ్డి మరచిపోవటమే విచిత్రం. కాలచక్రం తిరుగుతున్నపుడు ఒక్కోసారి మాజీలవుతారు మరోసారి మంత్రులవుతారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: