అధిష్టాన్నానే బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు షాక్ తప్పేట్లు లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీకి గెహ్లాట్ నామినేషన్ వేయబోతున్న విషయం తెలిసిందే. గెహ్లాట్ తో పాటు ఇంకా ఎవరెవరు పోటీచేస్తారో స్పష్టత లేకపోయినా సీఎంకు మాత్రం సోనియాగాంధీ ఆశీస్సులున్నట్లు ప్రచారం. అయితే సోనియా మద్దతును చూసుకుని చివరకు సోనియానే బ్లాక్ మెయిల్ చేసే స్ధాయికి గెహ్లాట్ ఎదిగిపోయారు.





ఈ విషయంలో రాజస్ధాన్ కు వెళ్ళిన పరిశీలకుల సమక్షంలోనే బయటపడింది. అధ్యక్షుడు అవబోతున్న సందర్భంగా సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై అధిష్టానం మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ అనే సీనియర్లను పంపింది. సీఎల్పీ సమావేశంలో ఎంఎల్ఏల అభిప్రాయాలను తీసుకునేందుకు స్వయంగా సోనియానే వీళ్ళిద్దరిని పంపారు. అయితే ఎంఎల్ఏలు అసలు వీళ్ళిద్దరినీ లెక్కేచేయలేదు. సీఎల్పీ సమావేశానికి ప్యారలల్ గా ఒక మంత్రింట్లో గెహ్లాట్ వర్గంగా ముద్రపడిన ఎంఎల్ఏలు సమావేశమయ్యారు.





అధ్యక్షపదవితో పాటు సీఎంగా కూడా గెహ్లాట్ నే కంటిన్యు చేయించాలని లేకపోతే గెహ్లాట్ చెప్పిన వారిని మాత్రమే సీఎంగా అంగీకరిస్తామని అల్టిమేటమ్ జారీచేశారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే తామంతా రాజీనామాలు చేయటానికి కూడా రెడీగా ఉన్నట్లు మంత్రులు, ఎంఎల్ఏలు సోనియాను బెదిరించారు. దాంతో చేసేదిలేక ఖర్గే, మాకెన్ చివరకు ఢిల్లీకి వెళ్ళిపోయి విషయమంతా సోనియాకు వివరించారు. దాంతో గెహ్లాటే తెరవెనుక ఉండి మంత్రులు, ఎంఎల్ఏలను నడిపిస్తున్నారని అందరికీ అర్ధమైపోయింది.





అందుకనే  అధ్యక్షుడి పోటీనుండి గెహ్లాట్ ను తప్పించమని సీడబ్ల్యూసీ సభ్యులు సోనియాకు గట్టిగా చెబుతున్నారు. అలాగే సీఎంగా కూడా గెహ్లాట్ ను తీసేసి కొత్తవాళ్ళని పెట్టాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇపుడు గనుక గెహ్లాట్ ను కంట్రోల్ చేయకపోతే ముందు ముందు చాలామంది ఇదే పద్దతిలో నడవటం ఖాయమని సీనియర్లు సోనియాకు చెబుతున్నారు. ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగా గెహ్లాట్ కు ఇపుడు ఎటూ కాకుండాపోయే ప్రమాదంలో పడ్దారు. ఏకంగా అధిష్టానాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్న గెహ్లాటంటేనే సీనియర్లంతా మండిపోతున్నారు. మరి సోనియా ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: