బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. 2015 లో నెల్లూరు జిల్లాలో నవంబర్ నెలలో ఒకే రోజులో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈసారి అటు ఇటూ అలాంటి వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు.



తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అల్పపీడనం ప్రభావం చూపనుంది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..



నెల్లూరు, సూళూరుపేట, కృష్ణపట్నం, చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి. ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: