జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించినవేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లా పర్యటనలో నాదెండ్ల మాట్లాడుతు రాష్ట్రంలో జనసేన బలం పెరుగుతోందన్నారు. తమపార్టీ బలం పెరిగేకొద్దీ రెండు మూడు పార్టీల్లో వణుకు మొదలైందన్నారు. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే జనసేనపై బురద చల్లేస్తున్నట్లు మండిపడ్డారు. పొత్తుల విషయాన్ని ప్రకటించేంత ధైర్యం తమ అధినేత పవన్ కల్యాణ్ కు ఉందని కూడా మనోహర్ అన్నారు.





సరే పవన్ ధైర్యం ఏమిటో  జనాలకు ఇపుడు కొత్తగా నాదెండ్ల చెప్పాల్సిన అవసరంలేదు. అయితే జనసేన బలపడుతుంటే రెండుమూడు పార్టీలు వణికిపోతున్నాయని ఏ పార్టీలను ఉద్దేశించి మనోహర్ అన్నారు ? రెండు మూడు పార్టీలంటే కచ్చితంగా వైసీపీ ఉంటుందనటంలో సందేహంలేదు. మరి మిగిలిన రెండుపార్టీలు ఏవి ? టీడీపీని కూడా  కలుపుకునే మనోహర్ ఈ మాటన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయి.





టీడీపీతో జనసేనకు పొత్తు గ్యారెంటీ అని అందరు అనుకుంటున్న సమయంలో మోడీ విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా మోడీతో పవన్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత పవన్ వైఖరిలో పూర్తిగా మార్పొచ్చేసింది. భేటీ అయిన దగ్గర నుండి అసలు టీడీపీ గురించే పవన్ మాట్లాడటంలేదు. పైగా చంద్రబాబునాయుడుతో పొత్తు వద్దని మోడీ తెగేసిచెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికారణంగా పవన్ కూడా టీడీపీ ప్రస్తావనను తేవటంలేదని అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఈ నేపధ్యంలోనే తాజాగా మనోహర్ వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించి కూడా ఉన్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి జనసేన బలపడుతోందని పవన్, మనోహర్ మాటల్లో తప్ప ఇంకెక్కడా కనబడటంలేదు. పార్టీ బలోపేతమైందనేందుకు ఆధారాలు కూడా లేవు. మరి ఏ లెక్క ప్రకారం వీళ్ళు ప్రత్యర్ధిపార్టీలు తమను చూసి వణికిపోతున్నాయని చెప్పుకుంటున్నారో అర్ధంకావటంలేదు. మొత్తానికి పవన్, మనోహర్  భ్రమల్లో బతుకుతున్నారా లేకపోతే జనాలను భ్రమల్లో ముంచేప్రయత్నం చేస్తున్నారా ? తెలీటంలేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: