‘ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదే అని అంగీకరించిన మంత్రి బొత్సా సత్యనారాయణ మరి రాజీనామా చేయాలి కదా’ ?...’బొత్సా రాజీనామా చేస్తేనే విలువలతో కూడిన రాజకీయాలు చేసినట్లవుతుంది’ ఇవి చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిన మూడింటిలో ఉత్తరాంధ్ర సీటు కూడా ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి సీనియర్ అయిన బొత్స మీద పెట్టారు.





అయితే అధికారిక పార్టీ ఓడిపోయింది. దానిపై మీడియాతో మాట్లాడుతు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదే అని అంగీకరించారు. బొత్స మాటలపైన చంద్రబాబు స్పందిస్తు రాజీనామా, నైతిక విలువలు అంటు చాలా మాటలే మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఓటమికి బొత్స కనీసం నైతిక బాధ్యత తనదే అని అంగీకరించారు. కానీ చంద్రబాబు ఏనాడూ అంగీకరించను కూడా లేదు.





2019లో పార్టీ ఘోరంగా ఓడిపోతే నైతిక బాధ్యత తనదే అని ఒక్కసారి కూడా చెప్పలేదు. పైగా జనాలను మోసం చేసి జగన్ ఓట్లేయించుకున్నారంటు బురదచల్లేశారు. అలాగే వైసీపీని గెలిపించిన జనాలను ఎన్నో సందర్భాల్లో శాపనార్ధాలు పెట్టారు. ఆ తర్వాత తిరుపతి పార్లమెంటుతో పాటు బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయినపుడు కూడా చంద్రబాబు నైతిక బాధ్యత వహించలేదు. పైగా మూడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి లోకల్ నేతలనే తీవ్రంగా తప్పుపట్టారు.





చంద్రబాబు స్టైల్ ఏమిటంటే ప్లస్ అయితే తన ఘనతగాను మైనస్ అయితే పక్కవాళ్ళ మీద తోసేస్తారు. ఇలాంటి వ్యక్తి కూడా విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సొస్తే చంద్రబాబు ఎన్నిసార్లు రాజీనామాలు చేసుండాలో. మంత్రిగా బొత్స రాజీనామా చేయటమన్నది వైసీపీ అంతర్గత వ్యవహారం. అయినా సరే  రాజీనామా చేస్తేనే విలువలతో కూడిన రాజకీయాలు చేసినట్లని బొత్సకు చెప్పటమే విచిత్రంగా ఉంది. బొత్సకు విలువలు లేవని  చెప్పటమంటే తనకు కూడా విలువలు లేని చంద్రబాబు అంగీకరించినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: