ఉపఎన్నికలయ్యాయి ఉసూరుమనిపించాయి. రాష్ట్ర కాంగ్రేస్ ప్రక్షాలనకు రాష్ట్రపతి ఎన్నికలు అడ్డురాగా అవికూడా పూర్తయ్యాయి. కఠిన నిర్ణయాలతో కాంగ్రేస్ ను పఠిష్టం చేసేందుకు సరికొత్త రారాజుగా రాహూల్ గాంధి తెరపైకి వచ్చారు.ఇక మన రాష్ట్ర కాంగ్రేస్ నేతల హస్తరేఖలు ఎలా ఉంటాయనేది హస్థిన నేతలు నిర్ణయించనున్నారు. తెలంగాణ అంశం పై తీసుకునే నిర్ణయమే రాష్ట్రంలో జరగునున్న మార్పుల్లో కీలకం కానుంది. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కాంగ్రేస్ కు చెందిన ఇద్దరు కీలక ఢిల్లీ నేతలు తాజాగా స్సష్టం చేశారు. ఈవిషయమై ఇప్పటి వరకు కూడా ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి అధిష్టానం రాలేదని కూడా వారు తెలిపారు. అయితే ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందన్నారు. అది ఉండబోయే తీరును బట్టి రాష్ట్ర కాంగ్రేస్ ముఖచిత్రంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా తీసుకుంటే సి.ఎం. పిసిసి పదవుల మార్పు అంతగా అవసరం ఉండదని, లేకుంటే తెలంగాణ నేతలను బుజ్జగించడం,ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉండేందుకు సి.ఎం పదవిని తెలంగాణ నేతకు కట్టబెట్టడం వంటి ఆలోచనలు అధిష్టానం వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి,పిసిసి అధ్యక్షుల మార్పు ఉండదంటూ కొందరు ఢిల్లీ పెద్దలు ఇప్పుడు కూడా ప్రకటనలు చేస్తుండడంతో తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకుంటారేమోనన్న ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ వైకాపా కాంగ్రేస్ అభ్యర్థి ప్రణబ్ కు ఓటు వేయడం కాంగ్రేస్ లో జరగనున్న మార్పులపై రకరకాల కొత్త ఆలోచనలకు తెరలేపింది. జగన్ పార్టి పెట్టక ముందు రోషయ్యను సిఎం పదవి నుంచి మారుస్తున్న సమయంలో జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కంటే సీనియరైన కేంధ్రమంత్రి జైపాల్ రెడ్డిని ఆపదవికి సూచించారని, ఆయనైతే తనకు పార్టీలో కొనసాగడానికి అభ్యంతరం లేదని సోనియాకు స్పష్టం చేశారని తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిని జగన్ అవుననకపోయినా కాదనకపోతుండడంతో ఇది నిజమేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే సిఎం పదవిని జైపాల్ రెడ్డికి కట్టబెడితే కాంగ్రేస్ అధిష్టానానికి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు ఇటు జగన్ ను మచ్చిక చేసుకోవడంతో పాటు, అటు తేల్చుకోలేక ముప్పుతిప్పలు పెడుతున్న తెలంగాణ సమస్య నుంచి బయటపడవచ్చన్నది కూడా అభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికల ద్వారా జగన్ అటు సీమాంధ్రలోను,ఇటు తెలంగాణలోను తన సత్తా ఏమిటో చూపించారు. జగన్ ను కాదని కాంగ్రేస్ నమ్ముకున్న నేతలంతా ఆయన ముందు కుదేలయ్యారు. ఈసమయంలో దేశంలోని పెద్దరాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో పార్టీని కాపాడుకోవాలంటే జగన్ ను దగ్గర తీసుకోవడం తప్ప మరోమార్గం కూడా లేదన్న ఆలోచనకూడా అధిష్టానం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ కూడా బయటపడాలంటే కాంగ్రేస్ అవసరమని జగన్ భావిస్తున్నారట అందుకే అడగకున్నా ప్రణబ్ కు మద్దతివ్వడం అందులో భాగమంటున్నారు. ఇప్పుడు స్పందించకపోతే ఎలాగోలా కేసుల్లోంచి జగన్ బయటకు వస్తే ఈఅవకాశం మల్లీ రాదని కూడా కాంగ్రేస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇలా ఏరకంగా ఆలోచించినా రాష్ట్రకాంగ్రేస్ ప్రస్తుత ముఖచిత్రంలో మార్పులుంటాయని విశ్వసనీయ సమాచారం. అందుకే మన హస్తం ఇప్పుడు హస్థినలో కొత్తరూపం సంతరించుకుంటోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: