దేశంలో నదుల అనుసంధానం చేసింది నేనే.. కృష్ణా, గోదావరిలను కలిపాను.. మొత్తం దేశంలోని 140 నదులను కలపాలి.. ఇలా అనేవారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నదుల అనుసంధానం మంచిదే.. కానీ ఆ అనుసంధానికి చాలా కసరత్తు కావాలి.. ఎంతో ముందుచూపు కావాలి.
కానీ అవేమీ లేకుండా చేయతలపెట్టిన గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని కాంగ్రెస్ నేత వట్టి వసంత కుమార్ వేసిన పిటీషన్ పై ఈ ఆదేశాలిచ్చింది.
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రతిపాదించింది. మొదట పట్టిసీమ.. ఆ తరువాత చింతలపూడి, 2018లో గోదావరితో పెన్నా అనుసంధానం... ఇలా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుందని వట్టి వసంతకుమార్ ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు సర్కారు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో పారదర్శకత లేదన్నది వట్టి వసంతకుమార్ ఆరోపణ. నదుల అనుసంధానం పనులకు ప్రభుత్వం అనుమతులు పొందలేదని... నిబంధనలు పాటించలేదని.. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు చేపట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులు బచావత్ ట్రైబ్యునల్ నిర్దేశానికి పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు.