సినీ నటుడు శివాజీని దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్నారట. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లిన శివాజీనీ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. శివాజీ దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం.


అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీపై హైదరాబాద్‌ పోలీసులు గతంలోనే లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసారు.. ఆ స‌మ‌యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు శివాజీ యత్నించగా హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను దేశం దాటి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు.


ప్రస్తుతం ఆయనపై ఉన్న ఆంక్షలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో శివాజీ దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు యత్నించారు. కానీ దుబాయ్ అధికారులు ఆయన్ను అడ్డగించి వెనక్కి పంపించేశారని తెలుస్తోంది. ఐతే.. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.


దుబాయ్ పోలీసులు ఆయన్ను ఎందుకు ఆపారో తెలియదన్నారు. మరి ఇంతకీ శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు ఎందుకు అడ్డగించారు. అసలు ఈ వార్తలో నిజం ఎంత..? మరోవైపు ఇదంతా శివాజీపై జరుగుతున్న దుష్ప్రచారం అని ఆయన అనుచరులు అంటున్నారు. ఈవార్తలన్నింటినీ అలంద మీడియా సంస్థల నుంచే పుట్టుకొస్తున్నాయని ఆరోపిస్తున్నారు.


గతంలో నటుడిగా మంచి ఇమేజ్ ఉన్న శివాజీ.. ఆ తర్వాత కాలంలో కొన్ని సామాజిక ఉద్యమాలు కూడా నిర్వహించారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అండతో సామాజిక కార్యకర్త టైపులో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఏవీ అంతగా సక్సస్ కాలేదు. ఆ తర్వాత కాలంలో టీడీపీకి అనుకూలంగా పని చేసిన శివాజీ ఇప్పుడు పాపం చిక్కుల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: