మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద రావుకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. రాత్రి పది గంటల సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందని తెలుస్తోంది. ఆయన్ను హుటాహుటిన లక్ష్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ లక్ష్మీ ఆసుపత్రి కోడెల శివ ప్రసాదరావు అల్లుడిదే కావడం విశేషం.
వరుసగా కొన్నిరోజులుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన, ఆయన కుటుంబం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక అరాచకాలు చేశారని జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ అంశం మరోసారి ఆయన్ను వివాదాస్పదం చేసింది.
హైదరాబాద్ నుంచి అసెంబ్లీని తరలించేటప్పుడు అక్కడి ఫర్నీచర్ ను కోడెల తీసుకెళ్లారన్నది అభియోగం. దీనిపై విచారణ కూడా మొదలైంది. ఈ ఫర్నీచర్ కోడెల శివప్రసాదరావు తనయుడుకు చెందిన షోరూమ్ లో ఉందన్న సమాచారంతో అక్కడ హడావిడి జరిగింది.
కోడెల శివరాం బైక్ షోరూమ్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బైక్ షోరూమ్ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం కూడా జరిగింది.
ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. అసెంబ్లీ ఫర్నీచర్ కేసు సీరియస్ గా మారుతుందని తెలుసుకున్నందు వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి ఉండొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి