ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి ప్రభావంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. రిజర్వాయర్లకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
భారీ వర్షాలతో సిక్కోలు తడిసిముద్ద అయ్యింది. శ్రీకాకుళం జిల్లా అంతటా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకూ ఎక్కడిక్కడ వాగులు పొంగి పంటపొలాలను ముంచెత్తాయి. బహుదానదికి భారీగా వరదనీరు పోటెత్తింది. వరద ఉధృతి పెరుగుతుండటంతో ఇచ్ఛాపురం పాత బ్రిడ్జి నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీపరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మహేంద్రతనయ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కవిటి, సోంపేట మండలాల పరిధిలోని బీల ప్రాంతంలో పంటపొలాలు ముంపుకు గురయ్యాయి. వంశధార వయాడక్ట్ వర్షాలకు నిండిపోవడంతో నీరంతా పొంగిపొర్లుతోంది . దీంతో అక్కడి నుంచి వెళుతున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి. భోగాపురంలో అత్యధికంగా 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. తోటపల్లి కెనాల్ కు గండిపడటంతో పంటపొలాలు నీట మునిగాయి. ఏడువంపుల గెడ్డ, గుమ్మడిగెడ్డ పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాలూరు, బొబ్బిలి, ఎస్ కోటతో పాటు జిల్లాలో వేలాది ఎకరాల్లో... పత్తి ,మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై వంతెన డ్యామేజ్ కావటంతో పార్వతీపురం, ఒరిస్సా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇంకా జిల్లాలోని పలుప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి.
మూడురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో విశాఖ జిల్లా తడిసి ముద్దయింది. భారీ వర్షాల కారణంగా యారాడ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారి దెబ్బతిని వాహనాల రాకపోకలు స్తంభించాయి. జీవీఎంసీ సహాయకచర్యలు నిర్వహిస్తోంది. మాడుగుల నియోజకవర్గాలలో ఉన్న మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిపడుతుండటంతో పెద్దేరు, రైవాడ, కోనాం,లోవ జలాశయాల నుంచి వరద నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.
కోస్తా ప్రాంతంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దివిసీమ వరద గుప్పిట్లో చిక్కుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్న ఆరులక్షల క్యూసెక్కుల నీరు దివిసీమను ముంచెత్తుతోంది. ఘంటసాల మండలం శ్రీకాకుళం, చల్లపల్లి మండలం నిమ్మకూరు, నడకుదురు, రాముడు పాలెంతోపాటు అవని గడ్డలో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. పులిగడ్డ ఆక్విడెక్ట్‌ను వరద తాకుతోంది. ఎడ్లలంక దగ్గర వరద ఉధృతికి కాజ్ వే తెగిపోవడంతో పరిసర గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
అటు గుంటూరు జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో కృష్ణానదికి రెండోసారి వచ్చిన వరదతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గాన్ని కృష్ణమ్మ వరద ముంచెత్తింది. వరదల కారణంగా పంటనష్టంతో పాటు పశువుల మేత కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొంది. వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, పెన్నా బ్యారేజ్‌లకు ఎగువనుంచి భారీగా వరద వస్తున్నప్పటికీ ఉపయోగం కనిపించడం లేదు. సంగం బ్యారేజ్ దగ్గర షట్లర్ దెబ్బతినడంతో నీరు వృధాగా పోతోంది. పెన్నా బ్యారేజ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ గేట్లు బిగించకపోవడంతో పొలాలకు చేరాల్సిన నీరంతా సముద్రంపాలవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి