టీటీడీ పాలక మండలి ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. 5,000 కోట్ల వరకు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ బోర్డు కేవలం జాతీయ బ్యాంకులకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం ద్వారా టీటీడీకి 100కోట్ల రూపాయల వరకు నష్టం కలుగుతుంది. 
 
ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 8.6 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. జాతీయ బ్యాంకులు 6.5 నుండి 7 శాతం వరకు మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీని ఇస్తున్నాయి. పాలకమండలి నిర్ణయంతో 1400 కోట్ల రూపాయలు టీటీడీ సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. అధికారులకు వడ్డీ ఆదాయం తగ్గుముఖం పట్టటంతో బడ్జెట్ లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కావటం లేదు. 
 
టీటీడీ ఆర్థిక పరిస్థితిపై టీటీడీ పాలక మండలి నిర్ణయం ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ పాలకమండలి వసతి గదుల రేట్లను పెంచే యోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని తగ్గించేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధులకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో జాతీయ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకులో టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 25 శాతానికి మించి ఉన్నాయి. వడ్డీలపై సాధారణంగా 840 కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయంగా వస్తోంది. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో ఈ వడ్డీకి 100కోట్ల రూపాయల కోత ఏర్పడనుంది. మరోవైపు టీటీడీ తిరుమలలో ప్లాస్టిక్ కనిపించకుండా తగిన చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. మూడు దశల్లో ప్లాస్టిక్ కనిపించకుండా టీటీడీ చర్యలు తీసుకోబోతుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: