ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉద్దేహల్ లో ఎక్సైజ్, ఈడీ అధికారులు ఒక రైతు తోటపై దాడులు జరిపారు. అక్రమంగా వైన్ ను అల్లనేరేడు ఫ్రూట్ జ్యూస్ పేరు చెప్పి తయారుచేస్తున్నారని ఎక్సైజ్, ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఐదుఎకరాల్లో అల్లనేరేడు తోటను మాజీ సర్పంచ్ మారుతీ ప్రసాద్ సాగు చేస్తున్నాడు. అక్కడ తయారు చేస్తున్న ఫ్రూట్ జ్యూస్ పై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఎక్సైజ్, ఈడీ అధికారులు 9,000 లీటర్ల జ్యూస్ ను స్వాధీనం చేసుకున్నారు. జ్యూస్ ను అధికారులు పరీక్షించటానికి ల్యాబ్ కు పంపించారు. ఫ్రూట్ జ్యూస్ పేరుతో అక్రమంగా వైన్ కూడా తయారు చేస్తున్నారని సమాచారం అందటంతో ఈ దాడులు జరిగాయి. 350క్యాన్లలో ఉన్న జ్యూస్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ కలిపి జ్యూస్ తయారు చేస్తున్నారా...? అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. 
 
ఎక్సైజ్ అధికారులు ప్రాథమికంగా వైన్ తయారీ జరుగుతోందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ వ్యాపారం ఇక్కడ కొనసాగుతోందని తెలుస్తోంది. సాగు చేస్తున్న రైతు మారుతీ ప్రసాద్ ఎక్సైజ్ అధికారుల దాడులతో అప్రమత్తమయ్యాడు. తాను జ్యూస్ మాత్రమే తయారు చేస్తున్నానని వైన్ తయారు చేయటం లేదని ఎక్సైజ్, ఈడీ అధికారులకు మారుతీ ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. 
 
గత కొన్ని నెలలుగా వ్యాపారం చేస్తున్న మారుతీ ప్రసాద్ జ్యూస్ పేరుతో వైన్ విక్రయిస్తున్నాడన్న అనుమానం స్థానికులకు కలిగింది. జ్యూస్ లోని ఆల్కహాల్ కంటెంట్ పరిశీలించిన తరువాత నిజంగా జ్యూస్ తయారు చేస్తున్నారా..? లేక జ్యూస్ పేరుతో వైన్ తయారు చేస్తున్నారా...? అనే విషయం తెలిసే అవకాశం ఉంది. భారీ స్థాయిలో అధికారులు ఫ్రూట్ జ్యూస్ ను స్వాధీనం చేసుకోవటంతో రైతు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్ లో జ్యూస్ ను పరీక్షించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: