భక్తులు గుడికి వెళ్లి దేవుడికి నమస్కరించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరతారు. కానీ ఒక దొంగ మాత్రం గుడికి వెళ్లి అమ్మవారి వెండి కిరీటాన్నే ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని దుర్గా భవానీ గుడిలో అమ్మవారికి దండం పెట్టి నిన్న సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అర కిలో వెండి కిరీటాన్ని ఎత్తుకొనివెళ్లాడు. వెండి కిరీటం దొంగతనాన్ని గుర్తించిన పూజారి వెంటనే ఆలయ నిర్వాహకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. ఆలయ నిర్వాహకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కిరీటం దొంగలించారని ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వెండి కిరీటం దాదాపు 20,000 రూపాయల ఖరీదు చేస్తుందని సమాచారం. పోలీసులు దొంగతనానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆలయంలోకి వచ్చిన తరువాత కాసేపు దండం పెడుతున్నట్లు నటించి దొంగ దొంగతనానికి పాల్పడ్డాడు. 
 
దండం పెట్టిన తరువాత చుట్టుపక్కల చూసిన దొంగ ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆ కిరీటాన్ని ప్యాంట్ జేబులో దాచుకున్నాడు. ఆ తరువాత దొంగ అక్కడినుండి పరారయ్యాడు. దొంగతనానికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అవటంతో పోలీసులు ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు దొంగ అంతకుముందు రెక్కీ ఏమైనా నిర్వహించాడా అనే విషయాన్ని తెలుసుకోవటానికి సీసీ టీవీ ఫుటేజీని కలెక్ట్ చేస్తున్నారు. 
 
దొంగతనం చేసిన వ్యక్తి బయటకు వచ్చిన తరువాత వెండి కిరీటాన్ని ఒక బ్యాగ్ లో పెట్టుకున్నట్లు ఆ తరువాత స్కూటీపై అక్కడినుండి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనం కేసులో సీసీ ఫుటేజీ చాలా కీలకంగా మారనుంది. అబిడ్స్ సర్కిల్ మీద నుండి దొంగ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: