దిశ డీఎన్‌ఏ రిపోర్టు త్వరలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అధికారులకు చేరబోతోంది. అయితే ఈ డీఎన్‌ఏ రిపోర్టులో భయంకరమైన వాస్తవాలు వెల్లడి కాబోతున్నట్టు తెలుస్తోంది. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద వంతెన కింద కాలిన మృతదేహాన్ని ఘటన వెలుగులోకి వచ్చిన రోజే.. అందులోని కొన్ని భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపారు. ఇప్పుడు ఆ ల్యాబ్ తుది నివేదిక తయారు చేసినట్టు సమాచారం. ఈ నివేదిక ద్వారా దిశ హత్యాచారం కేసులో కీలకమైన శాస్త్రీయ ఆధారం లభించిందని తెలిసింది.

 

పూర్తిగా కాలిపోయిన మృతదేహం నుంచి సేకరించిన ఎముక ఆధారంగా నిర్వహించిన టెస్టుల్లో అది దిశ దేహమేనని తేలింది. దిశ రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో ఆ ఎముక కాండాన్ని క్రోడీకరించడం ద్వారా దీన్ని నిర్ధారించారు. ఇది శాస్త్రీయ ఆధారం కావడంతో కేసుకు బలమైన సాక్ష్యం కానుంది.

 

మరోవైపు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొరికిన ఆమె లోదుస్తులపై వీర్యకణాల్ని పోలీసులు సేకరించారు. వాటిని విశ్లేషించే నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఘటనాస్థలిలోనే కొన్ని వెంట్రుకల్ని సేకరించారు. వాటినీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. నిందితుల రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌లతో వాటిని సరిపోల్చే పని కొనసాగుతోంది. అవి సరిపోలితే నిందితులే దిశపై అత్యాచారం చేసినట్లు మరో బలమైన ఆధారంగా నిలుస్తుంది. ఒకట్రెండు రోజుల్లోనే ల్యాబ్‌ నుంచి ఈ నివేదిక అందే అవకాశం ఉంది.

 

తాజాగా ఈ ఫోరెన్సిక్ నివేదిక సైబరాబాద్‌ పోలీసుల చేతికి ఆయుధంగా మారనుంది. దిశ హత్యాచారం కేసులో ఈ నివేదిక కీలకం కానుంది. దిశపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించే నివేదిక కూడా అందితే పోలీసుల పని ఇంకా సులువుగా మారుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: