టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ నెల 27వ తేదీన అగ్నిగుండ ప్రవేశం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని శంకర్ నాయక్ అన్నారు. శంకర్ నాయక్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందటం కొరకు తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. 
 
శంకర్ నాయక్ తాను తప్పు చేస్తే దేవుడే శిక్ష వేస్తాడని అన్నారు. రెడ్డి, వెలమ కులాలపై శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. శంకర్ నాయక్ మాట్లాడుతూ రెడ్డి, వెలమ కులాల సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రెండు రోజుల క్రితం శంకర్ నాయక్ మనిషికి మూడు రకాల బలుపులుంటాయని ఒకటి నేను వెలమ, రెడ్డి అనే బలుపు, ఒకటి నేను బాగా చదువుకున్నాననే బలుపు, మరొకటి బాగా డబ్బుందనే బలుపు అని అన్నారు. 
 
ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎవరిని కోసినా రక్తమే వస్తుందని అన్నారు. తన వ్యాఖ్యల్లో రెండు కులాల పేర్లను ప్రస్తావించటంతో ఆ రెండు సామాజిక వర్గ ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కొన్ని సామాజిక వర్గాల నుండి వ్యతిరేకత వస్తూ ఉండటంతో శంకర్ నాయక్ తాను ఎవరినీ కించపరచలేదని చెప్పారు. తాను మాట్లాడిన మాటల వలన ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటే తనను క్షమించాలని శంకర్ నాయక్ అన్నారు. 
 
కావాలనే కొందరు తన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని శంకర్ నాయక్ చెప్పారు. టీవీ చర్చలలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉండటం బాధగా ఉందని అన్నారు. కేసీఆర్ దయవలనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కేసీఆర్ కు కూడా వ్యాఖ్యల గురించి చెప్పానని అన్నారు. తాను ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: