చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అర్ధాంతరంగా రద్దయ్యింది. జనవరి 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర పర్యటనలో విస్తృతంగా పర్యటించాలని డిసైడ్ అయ్యారు. అయితే హఠాత్తుగా పర్యటన రద్దు అయినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి జిల్లా నేతలకు సమాచారం అందింది. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చంద్రబాబు నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మిగిలింది విజయనగరం జిల్లా మాత్రమే.
ఈ జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో కూడా భేటి అయితే మొత్తం ఉత్తరాంద్ర పర్యటన పూర్తయినట్లే అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత ఉత్తరాంధ్రలో సీన్ మారిపోయింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఎంతగా డిమాండ్ చేస్తున్నారో తెలిసిందే. రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు ఎట్టి పరిస్ధితుల్లోను అంగీకరించేది లేదంటూ చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారు.
చంద్రబాబు రచ్చ చేయటమే కాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు తో పాటు నేతలు కూన రవికుమార్ తదితరులతో గట్టిగా చెప్పిస్తున్నారు. దీన్నే ఉత్తరాంధ్రలోని చాలామంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మెజారిటి నేతలు తీర్మానాలు చేయటం చంద్రబాబుకు మింగుడుపడలేదు.
రాజధాని రగడ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తే ఇబ్బందిగా ఉంటుందని మెజారిటి నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. పైగా పార్టీలోని కొందరు నేతలు ఇదే కారణంతో రాజీనామాలు చేయటానికి కూడా రెడీ అవుతున్నట్లు చంద్రబాబుకు సమాచారం అందింది. ఇప్పటికే విశాఖపట్నం అర్బన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ రహ్మాన్ రాజీనామా చేయటం సంచలనంగా మారింది. రహ్మాన్ బాటలో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో తెలీటం లేదు. కాబట్టి ఇపుడు ఉత్తరాంధ్రకు రాకపోవటమే మంచిదన్న సలహాతోనే చంద్రబాబు తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి