చంద్రబాబునాయుడుకు ఇష్టమున్నా లేకపోయినా  పార్టీ భారాన్ని మోయక తప్పేట్లు లేదు. తిరుపతి పర్యటనలో నేతలతో మాట్లాడుతూ మరో పదేళ్ళ పాటు పార్టీ నాయకత్వాన్ని మోయక తప్పేట్లు లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారట. కాకపోతే వైసిపి వాళ్ళు తనకు వయస్సు అయిపోయిందని చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు లేండి. ఇదే విషయాన్ని నేతలతో మాట్లాడుతూ తాను మరో 15 ఏళ్ళపాటు పూర్తి ఆరోగ్యంగానే ఉంటానని స్పష్టం చేశారట. తన ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదని కూడా భరోసా ఇచ్చారట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం చంద్రబాబుకు 70 ఏళ్ళు. నిజానికి ఈ వయస్సులో పార్టీ కోసం  ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. సిఎంగా ఉంటే 70 ఏళ్ళ వయస్సు పెద్దగా సమస్యే కాదు. కానీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం 70 ఏళ్ళు అనేటప్పటికి వయస్సయిపోయిందనే అంటారు. అందునా జగన్మోహన్ రెడ్డి లాంటి యువకుడు సిఎంగా ఉండటం, చంద్రబాబును వ్యూహాత్మకంగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే తట్టుకోవటం కష్టమే.

 

కానీ భారమైనా పార్టీ నాయకత్వాన్ని మోయక తప్పటం లేదు. ఎందుకంటే సుపుత్రుడు నారా లోకేష్  సామర్ధ్యం అందరికీ తెలిసిందే. ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలకటం, ట్విట్టర్లో బుర్రకు తోచింది ట్వీట్ చేయటం మినహా క్షేత్రస్ధాయిలో చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నపుడే మాట్లాడిన ప్రతిమాట నవ్వులపాలైన విషయం అందరూ చూసిందే.

 

నిజానికి చంద్రబాబు కొడుకు అన్న అర్హత తప్ప లోకేష్ లో ఇంకెటువంటి అర్హత లేదు. అయినా చిన్న వయస్సులోనే   పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంఎల్సీ, పొలిట్ బ్యూరో సభ్యుడు, చివరకు  మంత్రి కూడా అయిపోయాడు. ఒకేసారి ఇన్ని పోస్టులు వచ్చేయటంతో తానేదో బ్రహ్మాండమైన మేధావిని అనే భ్రమల్లోకి వెళ్ళిపోయాడు లోకేష్. కాబట్టి లోకేష్ కెపాసిటిని బట్టి మరికొన్ని సంవత్సరాలు చంద్రబాబే పార్టీ నాయకత్వాన్ని మోయక తప్పేట్లు లేదు. అలా కాకుండా ఇపుడే లోకేష్ కు పార్టీ పగ్గాలప్పగిస్తే అంతే సంగతులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: