మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా...? మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉందా..? మీకు ఎవరైనా కాల్ చేసి క్రెడిట్ కార్డ్ వ్యాలిడిటీ పెంచుతామని, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని చెబుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఫోన్ లో మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇచ్చినా మీ కార్డుకు సంబంధించిన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో పడిపోయినట్లే అని చెప్పవచ్చు. 
 
గడచిన నెల రోజుల నుండి సైబర్ క్రైమ్ కు క్రెడిట్ కార్డు బాధితులు క్యూ కడుతున్నారు. డబ్బులు తమ ప్రమేయం లేకుండా పోయాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు పోలీస్ స్టేషన్లలో కూడా క్రెడిట్ కార్డ్ మోసాల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఈ మోసాల గురించి స్పందిస్తూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓటీపీ చెప్పాలని, ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ చెప్పాలని మోసాలు జరిగేవని ఇప్పుడు క్రెడిట్ కార్డు మోసాలు మొదలయ్యాయని చెబుతున్నారు. 
 
సైబర్ నేరగాళ్లు ఎవరి దగ్గర ఏ క్రెడిట్ కార్డ్ ఉందనే సమాచారాన్ని తెలుసుకుంటున్నారని ఆ సమాచారం సైబర్ నేరగాళ్లకు ఎలా చేరుతుందో తెలియాల్సి ఉందని చెబుతున్నారు. బ్యాంకుల్లో క్రెడిట్ కార్డ్ డిపార్టుమెంట్ నుండి ఫోన్లు చేస్తున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని, క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని చెప్పి కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. 
 
బాధితులు నిజంగానే బ్యాంకు క్రెడిట్ కార్డు డిపార్టుమెంట్ వాళ్లు అని నమ్మి అన్ని వివరాలను చెప్పేస్తున్నారని అన్నారు. ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డుల సమాచారం బయటపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన నెల రోజుల్లో దాదాపు 200 మంది క్రెడిట్ కార్డు బాధితుల జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫోన్ లో క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని పోలీసులు వినియోగదారులకు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: