ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి కాస్త వలసల జోరు తగ్గిందనే చెప్పాలి. అయితే అతి త్వరలో మూడు రాజధానుల అంశానికి ఫుల్ స్టాప్ పడనుండటంతో వలసలు జోరు అందుకుంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి మరికొందరు నేతలు అధికార వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. అది కూడా టీడీపీకి కాస్తో కూస్తో బలం ఉన్న కృష్ణా జిల్లా నుంచే నేతలు జంప్ అవ్వనున్నారని తెలుస్తోంది.

 

2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అయితే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, బాబుకు షాక్ ఇచ్చి జగన్ చెంతకు చేరారు. అధికారికంగా వైసీపీలో చేరకపోయినప్పటికి జగన్‌కు ఫుల్ మద్ధతు ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న దేవినేని అవినాష్ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. వీరిద్దరు పార్టీని వీడటంతో కృష్ణా జిల్లాలో టీడీపీకి ఇంకాస్త కష్టాల్లో పడింది.

 

అయితే ఈ కష్టాలు మరింత కొనసాగేలా త్వరలో ఓ ఇద్దరు బడా నేతలు టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. సీనియర్ నేతలుగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరావు, జలీల్ ఖాన్‌లు వైసీపీ వైపు వెళ్ళేందుకు రెడీ అయ్యారని సమాచారం. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ముద్దరబోయిన 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చేరడమే ఆలస్యం ఆయనకు చంద్రబాబు నూజివీడు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ముద్దరబోయిన వైసీపీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు చేతిలో ఓడిపోయారు. ఇక మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ టికెట్ దక్కించుకున్న ముద్దరబోయిన...మరోసారి మేక ప్రతాప్ చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేని ముద్దరబోయిన త్వరలో వైసీపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

 

ఇటు 2014లో విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పోటీకి దూరంగా ఉండి తన కుమార్తె షబానాని టీడీపీ తరుపున బరిలో నిలిపారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి పాలై… ఆ తర్వాత విదేశానికి వెళ్లిపోయింది. ఇక కుమార్తె విదేశాలకు వెళ్లడంతో జలీల్ పార్టీలో పెద్దగా తిరగడం లేదు. పైగా సొంత పార్టీ వాళ్లే తన కుమార్తెని ఓడించారనే అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జలీల్ పార్టీ కండువా మార్చేయడం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: