ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రకటన చేసిన తరువాత జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీల నివేదికలు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగానే వచ్చాయి. ప్రభుత్వం ఈ రెండు కమిటీల గురించి చర్చించేందుకు 20వ తేదీన అసెంబ్లీని, 21వ తేదీన శాసనమండలిని సమావేశవరచాలని నిర్ణయం తీసుకుంది.                           
 
రాజధాని మార్పునకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు దిశగా లేదా సీఆర్డీఏ సవరణల దిశగా ప్రతిపాదనలను చేయవచ్చని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం రాజధానిని మార్చటానికి అసలు గండం శాసనమండలిలో ఉంది.   
 
ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టనున్న బిల్లును మండలిలో మెజారిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. శాసన మండలిలో బిల్లును పరిశీలన కొరకు సెలక్ట్ కమిటీకి పంపడం లేదా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం లేదా సవరణలు ప్రతిపాదించి వెనక్కు పంపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అసెంబ్లీ మరోసారి ఆమోదం తెలిపినా మండలికి ఆ బిల్లును తిరస్కరించే అధికారం లేదా నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరే అధికారం ఉంది. అందువలన సీఎం జగన్ కు మండలి గండం తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీఎం జగన్ ఈ గండాన్ని ఎలా దాటుతాడో చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి బిల్లును ప్రవేశపెడితే శాసనమండలిలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: