తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పట్టు  సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సభలు సమావేశాలు నిర్వహిస్తూ అన్ని రాజకీయ పార్టీల నేతలు హడావుడి చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగుస్తుండడం, పోలింగ్ కు ఇంకా 48 గంటల సమయం మాత్రమే ఉండడంతో ముందు ఎటువంటి సభలు ,సమావేశాలు, ప్రచారాలు చేయకూడదనే నిబంధనలు ఉండటంతో గత మూడు నాలుగు రోజులుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు. 


మొత్తంగా 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లో గెలిచి గులాబీ జెండా రెపరెపలాడిస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే కాంగ్రెస్ కూడా నాలుగు కార్పొరేషన్లు దక్కించుకుని 76 మున్సిపాలిటీల్లో  తప్పక గెలిచి తీరుతాను గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీజేపీ కూడా 7 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీల మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టు చెబుతోంది. ఇలా ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు.ఇక ఈ ఎన్నికల్లో ప్రచారానికి టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వెళ్ళలేదు. బహిరంగ సభలు నిర్వహించలేదు. కేవలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తన సొంత నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేసి సరిపెట్టారు. 


ఇక మొత్తం బాధ్యత అంతా ఎమ్మెల్యేల మీద పెట్టేశారు. ఎమ్మెల్యేల పనితీరుకు ఇదొక పరీక్షగా కెసిఆర్ చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటాము కాబట్టి అధికార పార్టీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం టిఆర్ఎస్ వైఫల్యాలను పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య  హడావుడి చేస్తూ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 


కానీ ప్రజలకు తాము ఏమి చేస్తాము అనే విషయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక పోతోంది. బీజేపీ నాయకులు మాత్రం కాస్త హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికల బాధ్యత అంతా తమ భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ మస్లిజ్ స్నేహాన్ని హైలెట్ చేయడం ద్వారా ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి ప్లాన్ చేసి ఆ విధంగానే ప్రచారం చేస్తోంది. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, కేటాయించిన ఇళ్ళు వీటిపైన టిఆర్ఎస్ పార్టీ కి కిషన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రచారం ముందంజలో ఉండగా, బిజెపి ఆ తర్వాతి స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నట్టుగా సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: