వాళ్లంతా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లు.. పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. వాళ్లంతా కేసీఆర్ హామీలతో టీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే హైకమాండ్ దగ్గర సీన్ బాగానే ఉంది కానీ.. గ్రౌండ్ లెవల్లో మాత్రం ఈ విలీనం సంపూర్ణం కాలేదు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది శాసనసభాపక్షంగా ఏర్పడి టీఆర్‌ఎస్ లో విలీనమయ్యారు.

 

వీరిలో 8 మంది ఎమ్మెల్యేల పరిధిలో ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు లోకల్ టీఆర్ఎస్ నేతలు మాత్రం కలుపుకుపోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎక్కువమంది అసమ్మతి, వర్గపోరును ఎదుర్కొంటున్నారు.

 

ఉదాహరణకు.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. జూపల్లి వర్గీయులు ఏకంగా ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున 20 వార్డుల్లో పోటీలో నిలిచారు. అంతే కాదు.. వారి తరఫున జూపల్లి ప్రచారం కూడా చేశారు.

 

సేమ్ సీన్.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ది కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గీయులు.. సురేందర్‌ వర్గానికి మద్దతివ్వడం లేదు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి, ఆయన చేతిలో ఓడిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పొసగడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిది ఇదే పరిస్థితి.

 

కొత్తగా పార్టీలోకి రావడంతో.. ఈ ఎమ్మెల్యేలు తమ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఓవైపు ఉంటే.. అదే సమయంలో లోకల్ టీఆర్ఎస్ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి వారిని ఇబ్బంది పెడుతోంది. మరి ఈ పరీక్షను ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: