తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.  ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్... సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన సిద్ధం చేస్తోంది.  

 

తెలంగాణలో సహకార ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.  ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీన స్క్రుటినీ ఉంటుంది. 10న  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ చేస్తారు. ఆ రోజునే ఆఫీస్ బేరర్ల ఎన్నిక నిర్వహిస్తారు.

 

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ ప్రభుత్వం...ఇదే ఊపులో మిగిలిన కోపరేటివ్ సంఘాల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని  భావిస్తోంది.  ఈ మేరకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.    ప్రస్తుతం ఉన్న 37 సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది.  దీంతో ఎన్నికలను నిర్వహించి..., 15 రోజుల్లోగా ప్రక్రియ ముగించాలని  ఆదేశించారు.

 

 జిల్లాల్లో మొత్తం 20 మండలాలకు గాను ప్రస్తుతం 37 సహకార సంఘాలు ఉన్నాయి.  ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన  మండలాల్లో అసలు సహకార సంఘాలు లేవు. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి రెండు సంఘాలు ఉండాలంటే గతంలో ఉన్న 37 సంఘాలకు అదనంగా మరో 15 సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాల్లో సహకార సంఘాల సంఖ్య 52కు చేరింది.

 

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కావడంతో... జిల్లాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే  ఫిబ్రవరి 9వ తేదీలోపు ఆయా సంఘాల్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: