చంద్రబాబునాయుడు వేసిన వ్యూహం బెడిసికొట్టడంతో తన గోతిని తానే తీసుకున్నట్లైంది. జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల  ప్రతిపాదన సమాచారం నిజానికి రాష్ట్రప్రభుత్వం నుండి అధికారికంగా కేంద్రప్రభుత్వానికి వెళ్ళాలి. అయితే ఇంకా ఆపనిని రాష్ట్రప్రభుత్వం చేయలేదు. ఇంతలోనే చంద్రబాబు తొందరపడ్డారు. ఎలాగైనా జగన్ ను ఇరికించాలనే వ్యూహంతో తన ఎంపిల ద్వారా సమాచారాన్ని కేంద్రానికి తెలియజేసి పార్లమెంటులో రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు.

 

అయితే ఇక్కడే తెలుగుదేశంపార్టీ  వేసిన ప్లాన్ బెడిసికొట్టి చివరకు చంద్రబాబు మెడకే చుట్టుకుంది.  వైసిపి ప్రభత్వం కేంద్రానికి తెలియజేయాల్సిన రెండు అంశాలను టిడిపినే చెప్పేసింది. పైగా కేంద్రం ద్వారా జగన్ ను ఇబ్బంది పెడదామని అనుకుని ప్లాన్ చేస్తే చివరకు రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చదనే సమాధానాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్రంతోనే చెప్పించింది టిడిపి. దాంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలిందనే  చెప్పాలి.

 

మూడు రాజధానుల వ్యవహారాన్ని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ పార్లమెంటులో లేవనెత్తారు. మూడు రాజధానుల ప్రతిపాదన కేంద్రానికి తెలుసా ? దీనిపై కేంద్రప్రభుత్వం స్పందన ఏమిటి ? అంటూ చాలా ప్రశ్నలే వేశారు. దానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తు మూడు రాజధానుల ప్రతిపాదనను పత్రికల్లో మాత్రమే చూసినట్లు చెప్పారు.  రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, ఇది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమే అంటూ తేల్చి చెప్పేశారు.

 

అలాగే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న సామూహిక నిరసనలు, పోలీసుల దాడులు తదితరాలపై మరో ఎంపి కేశినేని ప్రశ్న వేశారు. దానికి కూడా రాయ్ సమాధానమిస్తు ప్రజల భద్రత, పోలిసింగ్ అన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశాలే అంటూ తేల్చేశారు. రాష్ట్రం అభ్యర్ధిస్తేనే అదనపు బలగాల గురించి కేంద్రం ఆలోచిస్తుందంటూ స్పష్టం చేసేశారు. దాంతో  రాష్ట్రం పరిధిలోని అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోదన్న విషయాన్ని పార్లమెంటు  సాక్షిగా కేంద్రం చెప్పేసింది.  కాబట్టి  ఇక ఈ విషయాల్లో కేంద్రం జోక్యం ఉండదన్న విషయంలో క్లారిటి వచ్చేసింది. నిజానికి రాజధానా అంశాన్ని రాష్ట్రప్రభుత్వమే ప్రస్తావించుంటే కేంద్రం ఎలా స్పందించేదో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: