గుజరాత్ భుజ్ లో కాలేజీ విద్యార్థినుల బట్టలు విప్పి మరీ నెలసరి ఉందో.. లేదో చెక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. తమను మెంటల్ టార్చర్ చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతవరకూ ఫిర్యాదు నమోదు చేసుకోలేదని ఆరోపించడంతో.. కచ్ వర్సిటీతో పాటు గుజరాత్ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాయి. 

 

గుజరాత్ భుజ్ సహజానంద్ ఇన్ స్టిట్యూట్ లో గార్డెన్ ఏరియాలో వాడేసిన శానిటరీ ప్యాడ్ ను వార్డెన్ గమనించారు. ఆమె ప్రిన్సిపల్ కు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో విద్యార్థినులందర్నీ కాలేజ్ గ్రౌండ్ లో సమావేశపరిచారు. పీరియడ్స్ తో ఉంది ఎవరు అని అడిగితే.. ఇద్దరు ఒప్పుకున్నారని, అయినా అందర్నీ చెక్ చేసి.. మెంటల్ టార్చర్ చేశారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులైనా ఇంతవరకు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటున్నారు విద్యార్థినులు. ట్రస్ట్ మెంబర్ ను అడిగితే.. జరిగిందేదో జరిగింది.. వదిలేయండి అని చెప్పారని వాపోయారు. 

 

అయితే సహజానంద్ ఇన్ స్టిట్యూట్ ను స్వామి నారాయణ్ మందిర్ భక్తులు ప్రారంభించారు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెబుతున్నారు. నెలసరితో ఉన్న విద్యార్థినుల్ని హాస్టల్ కిచెన్ లోకి కూడా అలో చేయరని, క్లాస్ లో కూడా చివరి బెంచీల్లో కూర్చోవాలని, ఇతరుల్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదని అంటున్నారు. 

 

ఈ ఘటనపై దుమారం రేగడంతో.. కచ్ యూనివర్సిటీ ఐదుగురు సభ్యుల విచారణ బృందాన్ని నియమించింది. అటు గుజరాత్ మహిళా కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తోంది. సహజానంద్ ఇన్ స్టిట్యూట్ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినుల పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నెలసరి అయిందో లేదో తెలుసుకునేందుకు ఇలా బట్టలు విప్పి చూడటం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: