తమ రాజకీయ అవసరాల ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేసేందుకు ఒక మెట్టు దిగేందుకు కూడా వెనుకాడడం లేదు. అసలు కేంద్ర బిజెపి నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో ఆయా రాష్ట్రాల బిజెపి నాయకులు కూడా అంతుపట్టడం లేదు. గజిబిజి నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తోంది బీజేపీ అధిష్టానం.  ఒకపక్క తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తూనే... మరోపక్క ఆ పార్టీకి దగ్గరయ్యే విధంగా కేంద్ర బిజెపి నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విధమైన వైఖరితో ఏపీలోనూ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీని వెనక బిజెపి రాజకీయ స్వలాభం కూడా బాగా కనిపిస్తోంది. 


ఎందుకంటే వైసీపీ లోక్ సభ సభ్యుల తో బీజీపీకి పెద్దగా పనిలేదు. కానీ రాజ్యసభ విషయానికి వచ్చేటప్పటికీ బిజెపి చాలా బలహీనంగా ఉంది. వచ్చే ఏప్రిల్ లో వైసీపీకి రాజ్యసభ సీట్లు పెరగబోతున్నాయి. ఈ కారణంగానే ఆ పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. అదీ కాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం బలం పుంజుకుంటుందనే అనుమానం కూడా బిజెపి అగ్రనేతల్లో ఉంది. అందుకే వైసీపీని పూర్తిస్థాయిలో కట్టడి చేయకుండా ఆ పార్టీతో అవసరాల మేరకు సన్నిహితంగా ఉంటోంది.


 ఇక తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాన శత్రువు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడంతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా బిజెపి అగ్ర నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి లోపాయికారిగా పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడానికి కూడా కారణం కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ పై జగన్ ఆగ్రహం గా ఉండడంతో తమకు జగన్ వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో అధికార పార్టీ తో సన్నిహితంగా మెలిగితే బెటర్ అని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. 


అదే సమయంలో ఏపీలో జనసేన ద్వారా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. పవన్ కు క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినా.. అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పవన్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ తో కలిసి అడుగులు వేస్తూనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలగాలని నిర్ణయనించుకున్నట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: