గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ ఒకప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడా వణికించిన విషయం విదితమే. దాదాపు 20 సంవత్సరాల పాటు వీరప్పన్ పేరు వినపడితే చాలు ప్రజలు భయాందోళనకు గురయ్యేవారు. 2004 లో తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వీరప్పన్ ను, అతని అనుచరులను కాల్చి చంపింది. మూడు రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన్ కూతురు విద్యా రాణి తాజాగా బీజేపీ పార్టీలో చేరారు. 
 
ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు జిల్లా కేంద్రం కృష్ణగిరిలో ఒక భారీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్ తదితరులు హాజరయ్యారు. వీరి సమక్షంలో విద్యా రాణి బీజేపీలో చేరారు. దాదాపు వెయ్యి మంది విద్యా రాణి అనుచరులు, మిత్రులు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీలో చేరారు. 
 
చేరిక అనంతరం విద్యా రాణి సభలో ప్రసంగించారు. విద్యా రాణి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల శ్రేయస్సు కొరకు తాను కృషి చేస్తానని చెప్పారు. పేద ప్రజల కోసమే తన తండ్రి వీరప్పన్ కృషి చేశారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తన తండ్రి కూడా కోరుకున్నారని కానీ తన తండ్రి ఎంచుకున్న మార్గం తప్పని విద్యా రాణి అన్నారు. తనతో పాటు తన కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోందని విద్యా రాణి అన్నారు. 
 
ఇప్పటికీ తన తండ్రిని కొన్ని వందల గ్రామాలు దేవునిలా కొలుస్తాయని దీన్ని బట్టే తన తండ్రి ఎలాంటివారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని విద్యా రాణి అన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా నిరుపేదలు, పేదల కోసం తాను పని చేయాలని అనుకుంటున్నానని విద్యారాణి చెప్పారు. విద్యా రాణి వృత్తిపరంగా న్యాయవాది కాగా సామాజిక కార్యకర్తగా కూడా అమె గుర్తింపు తెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: