అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ భారత పర్యటనలో 22 కిలో మీటర్ల  మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో  అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన  కార్లలోనే ట్రంప్  ప్రయాణిస్తారు. 

 

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే ది బీస్ట్. బీస్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. 1963లో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఇందుకోసం భారీగానే వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ వినియోగిస్తున్న సరికొత్త కాడిలాక్ మోడల్ ను 2018 సెప్టెంబరు 24న కాన్వాయ్‌ లో ప్రవేశపెట్టారు. అత్యంత అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారుచేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే. 

 

రాత్రిపూట ప్రయాణాల్లో కనిపించటానికి ఈ కారులో నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి జీవ రసాయన దాడుల నుంచి కూడా అధ్యక్షుడికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుంది. ఈ కారు అద్దాలు ఐదు అంగుళాలతో బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో ఉంటాయి. గాజు, పాలీకార్బొనేట్ తో ఐదు లేయర్లలో ఈ అద్దాలను తయారు చేశారు.  కేవలం డ్రైవర్ విండో మాత్రం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. డోర్ లు 8 అంగుళాల మందంతో సాలిడ్ గా ఉంటాయి. 

 

ఈ బీస్ట్ బాడీని 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో తయారు చేశారు. బాంబ్ ప్రూఫ్ అండర్ కేరేజీ అమెరికా అధ్యక్షుడిని  ఎలాంటి ప్రమాదంలో అయినా సేఫ్ గా కాపాడుతుంది. ఎవరైనా ఈ కారుకి అడ్డుపడితే టియర్ గ్యాస్ వదిలే ఏర్పాటు  కూడా ఉంది. ఏదైనా దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారులోనుంచే అవసరమైతే షాట్ గన్ ద్వారా గుళ్ల వర్షాన్ని కూడా కురిపించవచ్చు. అనూహ్యమైన ప్రమాదం జరిగితే అధ్యక్షుడిని  కాపాడటానికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం వంటి సదుపాయాలు ఈ కార్లలో ఉంటాయి.

 

బీస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఎంతటి బ్లాస్ట్ ని అయినా తట్టుకుంటుంది. టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు.. పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపల ఉండే స్టీల్ రీమ్లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇక ఎమర్జెన్సీ పరిస్థితిలో అధ్యక్షుడు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నా కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో, పెంటగాన్ తో  మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది.

 

ఇన్ని ప్రత్యేకతలున్న బీస్ట్ ని  డ్రైవ్ చేయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. అందుకే అమెరికా సీక్రెట్ సర్వీస్ కు చెందిన వారు మాత్రమే ఈ కారుని నడుపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో, 180 డిగ్రీల్లో కారుని ఎలా తిప్పాలో, విపత్కర పరిస్థితిలో ఎలా డ్రైవ్ చేయాలో డ్రైవర్ కు శిక్షణ ఇస్తారు. ఈ బీస్ట్ కారు ఒక్కోదాని ధర 1.5 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో కారు బరువు దాదాపు 10 వేల కిలోలు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: