దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ప్రయాణికులు జనరల్ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ప్రయాణికులు ఇకనుండి మరింత తేలికగా జనరల్ టికెట్లను పొందవచ్చు. యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఇప్పటికే ఉంది. కానీ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉండటంతో ప్రయాణికులు ఈ యాప్ ఉపయోగించడానికి ఆసక్తి చూపలేదు. 
 
తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా టికెట్లను బుక్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, గుంటూరు, విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగంపేట్, ఇతర ప్రాంతాలలో యూటీఎస్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్ లలో క్యూఆర్ కోడ్ విధానం ఏర్పాటు కానుంది. ప్రయాణికులు యూటీఎస్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి సులభంగా జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 
 
దాదాపు 9 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్నారు. ఐఆర్‌సీటీసీతో పాటు రిజర్వేషన్‌ కార్యాలయాల్లో నాన్ ఏసీ, ఏసీ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ఉంది. జనరల్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. రైల్వే శాఖ మూడేళ్ల క్రితం ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. కానీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉండటంతో ప్రయాణికులు ఈ యాప్ పట్ల ఆసక్తి చూపలేదు. 
 
తాజాగా క్యూఆర్ కోడ్ సదుపాయం ప్రవేశపెట్టడంతో ప్రయాణికులు స్టేషన్ కు ఒక కిలోమీటర్ దూరం నుండి స్టేషన్ వరకు సెకన్లలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టటం వల్ల యాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. యూటీఎస్ యాప్ ఉపయోగించి దేశంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: