ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే 80 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వైరస్ భారీన పడి 3,287 మంది మృతి చెందారు. 95,000 మందికి పైగా కరోనా భారీన పడ్డారు. కరోనాకు సరైన చికిత్స లేకపోవడంతో ప్రజలు కరోనా పేరు వింటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాయి. 
 
భారత్ లో అధికారికంగా ఇప్పటివరకూ 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరిశోధకులు ప్రజలు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాజాగా మొబైల్ ఫోన్లతో కూడా కరోనా వ్యాపిస్తుందని తేలిందని చెబుతున్నారు. కరోనా మొబైల్ స్క్రీన్ లతో వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ వైరస్ మొబైల్ హ్యాండ్ సెట్స్, హ్యాండిల్స్ లాంటి ధృడ ఉపరితలాలపై ఎక్కువ కాలం జీవిస్తాయని చెప్పారు. 
 
మొబైల్ ఫోన్లు కరోనా వ్యాప్తికి వారధులుగా నిలిచే అవకాశం ఉందని పరిశోధకులు అన్నారు. సాధారణంగా కరోనా భారీన పడిన వారి నుండి వచ్చే తుమ్ములు, తుంపర్ల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మొబైల్ స్క్రీన్లపై చేరితే మాత్రం వారం రోజులకు పైగా ఫోన్లపై తిష్ట వేసే అవకాశం ఉంది. నిపుణులు మొబైల్ ఫోన్లు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
మొబైల్ స్క్రీన్స్ బ్యాక్టీరియా, వైరస్ పెరిగేందుకు ఉపయోగించే పెట్రీ ప్లేట్స్ మాదిరిగా పని చేస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు ఆల్కహాల్ వైప్స్ తో ఫోన్ ను తుడిస్తే మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో బయటి నుండి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్రంలో కరోనా ఎవరికీ సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం ఛేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: