సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటారని అంటారు. అయితే అప్పుడప్పుడు కొందరు మహిళల విజయం వెనుక కొందరు పురుషులు కూడా ఉంటారు. అలా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విజయం వెనుక ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చాలానే ఉంది. ఆదిరెడ్డి భవానీ దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె అని అందరికీ తెలుసు. ఇక భవానీ 2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆమె బాబాయ్ అచ్చెన్నాయుడు, సోదరుడు రామ్మోహన్ నాయుడుల ఇమేజ్ ఏ విధంగా ఉపయోగపడిందో, ఆమె భర్త శ్రీనివాస్ కష్టం కూడా చాలా వరకు కలిసొచ్చింది.

 

30 వేలపైనే మెజారిటీతో గెలవడానికి శ్రీనివాస్ కృషి గట్టిగానేఉంది. ఇక భవానీ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి శ్రీనివాస్ ఆమె వెనుకే ఉంటున్నారు. ప్రతి విషయంలో అండగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ప్రజలు సమస్యలు తెలుకుంటున్నారు. ఇలా అన్నివిషయాల్లో భవానీకి అండగా నిలుస్తున్నారు.

 

ఇక స్థానిక సంస్థ ఎన్నికలు రావడంతో కీలకమైన రాజమండ్రి కార్పొరేషన్‌లో టీడీపీ గెలుపు కోసం శ్రీనివాస్ బాగా కష్టపడుతున్నారు. కార్పొరేషన్ ఎక్కువ శాతం వీరి నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో శ్రీనివాస్ గెలుపు బాధ్యతలని తన భుజాల మీద వేసుకున్నారు. అధికార వైసీపీ ధీటుగా వ్యూహాలు రచిస్తూ, ముందుకెళుతున్నారు. అటు పక్కనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ సహకారంతో కార్పొరేషన్‌లో వైసీపీని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మామూలుగానే రాజమండ్రి కార్పొరేషన్‌ టీడీపీకి కంచుకోటగా ఉంది. మూడుసార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే, టీడీపీనే విజయం సాధించింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఇదే అడ్వాంటేజ్‌తో టీడీపీని గెలిపించుకోవాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కష్టపడుతున్నారు. కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్నారు. మరి శ్రీనివాస్ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. మొత్తానికైతే శ్రీనివాస్ బ్యాగ్రౌండ్‌లో బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: