మరోసారి ఏపీ లో మంత్రి పదవులు అంశం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికల సందడి నెలకొన్నా, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు మాత్రం అప్పుడే జగన్ తమకు అవకాశం కల్పించ బోతున్నాడు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేయడంతో, రెండు మంత్రి పదవుల కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే జగన్, విజయసాయి రెడ్డి వంటి వారి వద్ద తమకు మంత్రి పదవులు కేటాయించాలి, అనే విషయమే పెద్ద స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ..  ఎమ్మెల్సీల నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.


 త్వరలోనే శాసనమండలి కూడా రద్దు అవుతుండడంతో ఆ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరే వారి సంఖ్య పెరిగిపోతోంది. మొదటి విడత మంత్రివర్గంలోనే తన పేరు ఉంటుందని భావించిన రోజాకు జగన్ మొండిచేయి చూపారు. సామాజిక సమీకరణాల లెక్కల్లో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో జగన్ ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయినా.. రోజా మంత్రి కావాలని తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికీ అనేక సందర్భాల్లో బయటపెట్టారు. దీంతో త్వరలో చేయబోయే మంత్రివర్గ విస్తరణలో రోజా కు మంత్రి పదవి వస్తుందని చాలామంది నమ్మకంగా ఉన్నారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. 


గతేడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ అధ్యక్షుడు లోకేష్ ను ఓడించి రామకృష్ణారెడ్డి తన సత్తా చాటుకున్నారు. మొదటి విడతలోనే ఆయనకు అవకాశం దక్కుతుంది అని అందరూ అంచనా వేసినా, జగన్ మాత్రం రామకృష్ణారెడ్డి కి ఇవ్వలేదు. వీరే కాకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, ఇలా చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే నెలలో మంత్రి మండలి విస్తరణ ఉంటుందని అందరూ అంచనావేస్తున్నారు. అయితే జగన్ కరుణ ఎవరిమీద ఉంటుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: