నిజామాబాద్ ఎంపీ గా పనిచేసిన కాలంలో టిఆర్ఎస్ లో తనదైన శైలిలో చక్రం తిప్పారు కేసీఆర్ కుమార్తె కవిత. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలిగా పార్టీలోనూ ఊపు తెచ్చే విధంగా ఆమె వ్యవహరించారు. ఒక దశలో కేటీఆర్ ను మించి ఆమె పాపులారిటీ తెలంగాణలో సాధించారు. రెండోసారి నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేసిన కవితకు ఓటమే పలకరించింది. ఆమె ఒక్కసారిగా రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కు రెండు రాజ్యసభ స్థానాలు దక్కడంతో వాటిలో ఒకటి తనకు ఇస్తారని కవిత ఆశలు పెట్టుకున్నారు. అలాగే కవితకు మంత్రి పదవి ఇవ్వాలని ఇంట్లోనూ ఒత్తిడి పెరగడంతో ఆమెకు రాజ్యసభ స్థానం దక్కుతుందని, ఢిల్లీ లో టిఆర్ఎస్ తరఫున ఆమె చక్రం తిప్పుతారని, అంతా భావిస్తున్న తరుణంలో కేసీఆర్ రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 


అందులో ఒకటి సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు ఒకటి కేటాయించగా, రెండోది ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటించకపోయినా వీరి పేర్లే ఫైనల్ అయినట్టుగా ప్రచారం నడుస్తోంది. కేశవరావుకు ఒక పదవి ఇచ్చినా రెండవది తనకే ఇస్తారని కవిత అంచనా వేయగా, పొంగులేటి పేరు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సీటును త్యాగం చేయడంతో అప్పుడే ఆయనకు రాజ్యసభ స్థానం ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. 


ఆ హామీ మేరకు ఇప్పుడు పొంగులేటి పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అదీ కాకుండా జగన్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాజ్యసభ స్థానం ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి నిరాశ నిస్పృహలు కవితలో అలుముకున్నాయి. ఇప్పటికే తాను సీఎంగా ఉన్నానని, తన కుమారుడు కేటీఆర్ మంత్రి గా ఉన్నారని, మేనల్లుడు హరీష్ రావు మంత్రి గా ఉన్నారని, ఇంకో మేనల్లుడు సంతోష్ కూడా కీలక పదవిలో ఉన్నారని, ఇలా అందరూ అన్ని పదవుల్లో ఉండడంతో కవితకు కూడా మరో పదవి ఇస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే కెసిఆర్ ఆమె పేరు తప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కవిత మాత్రం ఉత్కంఠతో ఫైనల్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: