తెలుగు రాష్ట్రాలను కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 20 అనుమానిత కేసులు ఉండగా... ఏపీలో ఏడుగురికి లక్షణాలు ఉన్నాయి. దీంతో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా భయంతో  నెల్లూరులో అన్నీ మూతపడ్డాయి.

 

అసలే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ప్రచారానికి పార్టీలు సన్నద్ధమవుతుండగా...పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు పార్టీల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా సోకడంతో... స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అనధికారిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో పట్టణం మొత్తం బోసిపోయి ఉంది. పెట్రోల్‌ బంకులు ఖాళీగానే కన్పిస్తున్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. థియేటర్లు కూడా ఓపెన్ కాలేదు.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

 

కడప జిల్లాలో కరోనా కలకలం రేపింది. గల్ఫ్‌ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో...ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిన్నటి నుంచి ఐసోలేషన్‌వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు...శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపించారు. 

 

కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తులకు అవసరమైతే నిర్బంధ వైద్య చికిత్స అందిస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెల్పింది. కరోనా నిరోధానికి 'ఎపిడమిక్‌ డీసీజెస్‌ యాక్ట్‌' అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 55 మంది నమూనాలను పరీక్షలకు పంపించగా.. వాటిలో 47 మంది నమూనాల ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయన్నారు. మరో ఏడుగురి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. 

 

ఇటు తెలంగాణలోనూ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలోనూ అనుమానిత కేసు నమోదైంది. పెగడపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కన్పించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడు 15 రోజుల క్రితమే దుబాయ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 

 

ఇటు వరంగల్ జిల్లాలో కరోనా లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన యువకుడు ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. గాంధీ ఆస్పత్రితో పాటు పూణేకు పంపనున్నారు. ఆ రిపోర్టులు వచ్చే వరకూ ఐసోలేషన్ వార్డులోనే ఉంచనున్నారు డాక్టర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: