ఏపీలో జగన్ పాలనపై జనసేన నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాటిలో పవన్ కల్యాణ్, నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇదొక క్రిమినల్‌ ప్రభుత్వం అని, దాడులు చేస్తే బెదిరిపోమని, కేసులు పెడితే భయపడి పారిపోబోమని పవన్‌ స్పష్టం చేశారు. నేను యువతనే నమ్మాను. జేజేలు కొట్టేవాళ్ళను కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

 

 

నాకు నిలబడి పోరాడేవాళ్లు కావాలి. లక్షమందిలో నలుగురే నిలబడతారు. కాని ఆ నలుగురే లక్షమంది మెదళ్లను కదలిస్తారు... అనంతపురంలో ఎంత భయపెట్టినా మొండిగా ఎంపీటీసీగా పోటీ చేస్తున్న పద్మావతి వంటివారు కావాలి. కాకినాడలో దౌర్జన్యాలను ఎదిరించిన ఆడపడుచులవంటి వారు కావాలి.. జనసంఘ్‌ జనతా పార్టీతో కలిసిపోయి పోటీచేస్తే రెండు సీట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.. కానీ తర్వాత బీజేపీ ఎదురులేని పార్టీగా మారిందని పవన్ గుర్తు చేశారు.

 

 

జనసేనను విలీనం చేయమని హోంమంత్రి అమిత్‌షా అడిగినా.. తాను తన స్టాండ్‌ తగ్గలేదని.. పార్టీని చంపనని.. ఇది మహా వృక్షమై తీరుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. క్రిమినల్స్‌ పాలన కావాలో, సమాజహితం కోరి మార్పు కోసం పోరాడేవాళ్లు కావాలో తేల్చుకోవాలని కోరారు. ‘ఏడేళ్లు నిలిచాను.. మరో 70 ఏళ్లు జనసేన నిలబడుతుంది. నా తర్వాత కూడా పార్టీ ఉండాలనేదే తన తపన అని పవన్ కల్యాణ్ అన్నారు.

 

ఇక పవన్ అన్నయ్య నాగబాబు కూడా జగన్ పాలనపై మండిపడ్డారు. నియంత హిట్లరే పతనమయ్యాడని, ఇక జగన్‌ ఎంతని ఆయన అన్నారు. బండరాయి ఓ దెబ్బకు బద్దలు కాకపోవచ్చు. రెండో దెబ్బకు పగలక పోవచ్చు. 99 దెబ్బలకీ... బద్దలు కాకపోవచ్చు. పవన్‌ 100వ దెబ్బకు జగన్‌ బండ పగులుతుందని నాగబాబు నమ్మకంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: