కరోనా వ్యాపించటంలో ప్రధానంగా నాలుగు దశలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటి రెండు దశలు పెద్దగా ప్రమాదకరం కాదు. కానీ, మూడు, నాలుగు దశలు దాటితే జరిగే నష్టం అపారం. ప్రస్తుతం ఇటలీ, చైనా నాలుగో దశ చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు కరోనా రెండో దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? 

 

ప్రపంచమంతా కరోనాధాటికి అల్లకల్లోలమవుతోంది. చైనాలో పుట్టి, యూరప్ అంతటా  వేగంగా విస్తరించిన కరోనా ఆసియా దేశాల్లో నెమ్మదిగా ఎంటరయింది. మన దేశంలో ఇప్పటికి 83 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో కొత్త కేసులు 8 నమోదయ్యాయి. 

 

అయితే కరోనా వ్యాపించే తీరులో ప్రధానంగా నాలుగు దశలు కనిపిస్తున్నాయి. ఇందులో భారత్ ఇప్పుడు రెండో దశలో ఉంది. కరోనా ప్రభావిత దేశాలనుంచి వచ్చిన వారిద్వారా వ్యాపించే పరిస్థితి ఉండటాన్ని మొదటి దశగా చెప్పుకోవచ్చు. రెండో దశలో స్థానికంగా బలపడి.. ఇక్కడి రోగులనుండి ఇతరులకు వ్యాపిస్తుంది. మూడో దశలో ఒకే ప్రదేశంలో భారీగా వ్యాపించి, పట్టణాలు, నగరాలు పూర్తిగా వైరస్ కు ఎఫెక్ట్ అవుతాయి. నాలుగో దశలో కరోనా కరాళనృత్యం చేస్తుంది. మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఓ పక్క కొత్త కేసులు తగ్గుతూ, రోజు మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం చైనా ఇటలీ దేశాలు కరోనా వ్యాప్తిలో నాలుగో దశకు చేరుకుంటే,  భారత్ రెండో దశలో ఉంది. 

 

కరోనా వ్యాప్తిలో భారత్  రెండో దశలో ఉండటంతో,  ఈ దశలోనే దాన్ని నిలువరిస్తే, ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉంటుంది. విదేశాలనుండి వచ్చిన కరోనా బాధితులను గుర్తించి ఐసోలేట్ చేసి వైద్యం చేయగలిగితే, వ్యాపించే అవకాశాలు బాగా తగ్గుతాయి. కానీ, కరోనా లక్షణాలు వైరస్ సోకిన వెంటనే బయటపడకపోవటం ఇక్కడ ఆందోళనకరంగా మారింది. ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ లో కరోనా సోకినట్టు లక్షణాలు కనిపించకుండా, ఆ తర్వాత వైరస్ వెలుగుచూస్తోంది. ఈ లోగా వైద్యం కోసం స్థానిక ఆస్పత్రులు తిరగటంతో, ఇంట్లోవారితో పాటు, ఆస్పత్రుల్లో ఇతరులకు వందల సంఖ్యలో కరోనా సోకే ప్రమాదం ఉంటోంది. దేశంలో తొలి కరోనా మృతుడు కర్ణాటక రోగికి శంషాబాద్ లో ఎలాంటి వైరస్ ని గుర్తించలేకపోయారు. కానీ, ఆ తర్వాత హైదరాబాద్ ఆస్పత్రిలో కరోనా గుర్తించటం ఈ లోపు ఇతరులకు వచ్చే అవకాశం ఏర్పడింది. 

 

దీంతో మనదేశంలో రెండో దశలోనే కరోనాను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల కరోనా వ్యాప్తిని దాదాపు పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. లేదా కనీసం నెమ్మదిగా వ్యాపించేలా చేసే అవకాశం ఉంది. చైనాలో కరోనాను గుర్తించిన తర్వాత, ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని గుర్తించటంలో ఆలస్యం జరిగింది. దీనిఫలితంగా యూరప్ లో చైనానుంచి వచ్చిన వారినుంచి పదులు వందల సంఖ్యలో అనేకమందికి వైరస్ సోకింది. ప్రధానంగా వుహాన్ నగరం నుండి వచ్చిన వారి నుండి వేగంగా విస్తరించింది. దీని ఫలితంగానే యూరప్ ఇప్పుడు కరోనా ధాటికి రెండో కేంద్రంగా మారి విలవిల్లాడుతోంది.   

 

ఇప్పటికి మనదేశంలో 83 కరోనా కేసులు మాత్రమే గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా, గుంపుగా ఒక్కచోట చేరకుండా ఉంటే కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యమే. మన దేశంలో ఇప్పటికి 51 ల్యాబ్ లు కోవిడ్ 19ని పరీక్ష చేసే సామర్థ్యంతో ఉన్నాయి. వీటిలో రోజుకు 4,590పరీక్షలు చేసే అవకాశం ఉంది. 57 శాంపిల్ కలెక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటికి రోజుకు 60,70శాంపిల్స్ కంటే ఎక్కువ రావటం లేదని సమాచారం. ఇప్పటికి మనదేశంలో ఆరున్నరవేలకుపైగా శాంపిల్స్ పరీక్ష చేస్తే, కేవలం ఒక్కశాతంపైగా మాత్రమే పాజిటివ్ కేసులు గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య విదేశీ ప్రయాణాలు చేసిన వారిని గుర్తించి కొంత కాలం ఐసోలేట్ చేసి పరీక్షించగలిగితే కరోనా వ్యాప్తిని చాలా వరకు అదుపు చేసే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: