మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వాస పరీక్షకు ముందే కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు బల పరీక్ష నిర్వహించాలని సూచించటంతో కమల్ నాథ్ అసెంబ్లీలో సరిపడా బలం లేదని రాజీనామా చేశారు. కాసేపట్లో గవర్నర్ లాల్జీ టాండన్ ను కలిసి సీఎం రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారని సమాచారం. 
 
సుప్రీం ఆదేశాల ప్రకారం ఈరోజు సాయంత్రం బల పరీక్ష నిర్వహించాల్సి ఉండగా మంత్రులు, ముఖ్య నేతల సూచనల మేరకు కమల్ నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. స్పీకర్ రాజీనామాలు ఇప్పటికే ఆమోదించటంతో సీఎం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీపై విమర్శలు చేశారు. 
 
గడచిన 15 నెలల్లో సీఎంగా తాను రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని, సంక్షేమ పథకాలను అమలు చేశానని చెప్పారు. అయినా బీజేపీ మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని అన్నారు. 
 
రాష్ట్ర ప్రజలు ఐదేళ్లు పరిపాలించాలని తమకు అవకాశం ఇచ్చారని.. కానీ బీజేపీ కుట్రల వల్ల కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని... 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని... మాఫియాకు వ్యతిరేకంగా పని చేయడం బీజేపీకి నచ్చలేదని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ఇప్పటివరకూ ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పారు. 2018 డిసెంబర్ లో తమ ప్రభుత్వం ఏర్పడిందని.. మెజారిటీ లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: