ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేయకపోతే.. లక్షల సంఖ్యలో ప్రాణాలు పోవడం ఖాయం. స్వయంగా ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కొవిడ్‌ 19 సృష్టిస్తున్న మారణహోమానికి ఈ మాటలు అద్దం పడుతున్నాయి. దేశాలన్నీ కలిసికట్టుగా ఈ వైరస్‌ను ఎదుర్కోవాలని ఐక్యరాజ్య సమితి సూచిస్తోంది. 

 

అత్యంత వేగంగా విస్తరిస్తూ.. భయోత్పాతాన్ని సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో సఫలం కాకపోతే మాత్రం.. రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించడం ఖాయం. ఈ విషయాన్ని మరెవరో కాదు.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కొవిడ్‌-19ను అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించారు. ఈ సమయంలో దేశాలు పరస్పరం సంఘీభావం తెలుపుకోవడమే కాదు.. సహకరించుకొని కలిసి ముందుకు సాగాలని సూచించారు. 

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే  దాదాపు 10వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో హెల్త్‌ ఎమర్జెన్సీ ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రతీదేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే..  సంక్షోభాన్ని ఎదుర్కొనగలమని తెలిపింది. అలాగే అంతటి స్థాయి లేని దేశాలకు సాయం అందించాలని అభిప్రాయపడింది. ఈ ప్రక్రియలో జీ20 దేశాలు ముందుండాలని సూచించింది. 

 

కరోనా వైరస్‌ త్వరలోనే ఆఫ్రికాలాంటి పేద దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలనూ తాకుతుందని యూఎన్‌ అంచనా వేసింది. అలాంటి దేశాలపై జీ20 దేశాలు దృష్టిపెట్టాలని.. ఆ దేశాలకు సాయం చేయకపోతే ఈ వైరస్‌ విపత్తుతో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో చేస్తున్న ప్రయత్నాలను అన్నిదేశాలు పాటించాలని ప్రభుత్వాలను ఐక్యరాజ్యసమితి అభ్యర్థించింది. కుప్పకూలుతున్న ఆర్థికవ్యవస్థలపై కూడా దృష్టిసారించాలని తెలిపింది. 

 

అల్ప ఆదాయం పొందే వారిని, చిన్న, మధ్య తరహా వ్యాపారులను కూడా ఈ సమయంలో ఆదుకోవాలని యూఎన్‌ సూచించింది. సామాజిక, ఉద్యోగ భద్రత, వేతనాలను ఇవ్వడం, ఇన్సూరెన్స్‌ వంటివాటితో వీరిని ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరింది. ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది. వివిధ దేశాల మధ్య ఉన్న విభేధాలను సైతం పక్కనపెట్టి.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని యూఎన్‌ సూచించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: