ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు అందిస్తామని... ఈ నెల 29నే రేషన్ సరుకులు ఇస్తామని... రేషన్ కార్డు ఉన్నవారికి కిలో పప్పు ఇస్తామని చెప్పారు. 
 
జగన్ మాట్లాడే సమయంలో మైక్ పదే పదే లౌడ్ అయింది. మైక్ నుండి జగన్ మాట్లాడిన మాటలు రీసౌండ్ రావడం మొదలైంది. ఆ సౌండ్ వినలేక రెండు మూడు సార్లు జగన్ చెవులు మూసుకున్నాడు. ఆ తర్వాత ఏంటి.. ఈ మైక్ అంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా కొంత సమయం పాటు మైక్ సౌండ్ పెరగడం తగ్గడం జరిగింది. చివరకు ఏం జరిగిందో తెలీదు కానీ మైక్ సెట్ అయింది. 
 
ఆ మైక్ సౌండ్ వల్ల ప్రెస్ మీట్ కు హాజరైన వారు కూడా ఇబ్బంది పడ్డారు. సీఎం జగన్ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ నెల 31 వరకు జగన్ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు 14 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని అన్నారు. పాలు, కూరగాయలు, మెడిసిన్ కోసం మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. 
 
రాష్ట్రంలో నిత్యావసర దుకాణాలు తప్ప అన్నీ బంద్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారు వెంటనే 104కు ఫోన్ చేయాలని సూచించారు. కరోనా నివారణలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ వాలంటీర్ల కృషి ఎనలేనిది అని అన్నారు.           

మరింత సమాచారం తెలుసుకోండి: