తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా పేరు ఎత్తితే చాలు కరీంనగర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇండోనేషియా నుంచి కొంతమంది జిల్లాకు రావడం... వారికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు టెన్షన్ పడుతున్నారు. 
 
జిల్లాలో కరోనా సోకకపోయినా కొందరికి కరోనా సోకిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పోలీసులు వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారంటూ కొందరు వదంతులు ప్రచారం చేశారు. కొందరు ఈ వార్తలు నిజమేనని నమ్మి పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా బయటకు వెళ్లడం లేదు. ప్రజలందరూ స్వచ్చందంగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోవడం గమనార్హం. 
 
జిల్లాలో ఇండోనేషియన్లు సంచరించిన ప్రాంతాలలో ప్రజలు ఇంట్లో నుంచి కాలు కూడా బయటకు పెట్టడం మానేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయం తెలిసి ఇంటింటికీ కూరగాయలను చేరవేసింది. కరీంనగర్ లో కొత్త కేసులు నమోదు కానప్పటికీ ప్రజల్లో మాత్రం కరోనా గురించి భయం నెలకొంది. ఈరోజు కరీంనగర్ లో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రజల్లో కరోనా గురించి ఏ రేంజ్ లో భయం ఉందో చెప్పకనే చెబుతోంది. 
 
కూరగాయలు కొనడానికి వచ్చిన ఒక వ్యక్తి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడి స్థానికులు అతనికి కరోనా సోకి ఉండవచ్చని భావించారు. కొందరు పోలీసులకు సమాచారం అందించటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతనిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకొనిరావడంతో అతడు మరణించాడని వైద్యులు పోలీసులకు తెలిపారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి: